అంగన్‌వాడీ చిన్నారులకు అస్వస్థత
పెళ్లకూరు: మండలంలోని కానూరు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలోని ఆరుగురు చిన్నారులకు మంగళవారం ఫుడ్‌పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. అంగన్‌వాడీ కేంద్రంలో ఏనిమిది మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి మంగళవారం మధ్యాహ్నం పులిహోర వడ్డించారు. మిగిలిన ఇద్దరు చిన్నారులు ఇంటికి వెళ్లారు. పులిహోరా తిన్న చిన్నారులు గురువర్షిత్, జోషన్, జశ్వన్, నాని, గురవయ్య, శాన్విక గంట వ్యవధిలో వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం నాయుడుపేటకు తరలించారు. సీడీపీవో ఉమామహేశ్వరి, నాయుడుపేట సీఐ సంఘమేశ్వరరావు, ఎస్‌ఐలు నాగరాజు, ఆదిలక్ష్మి, సూపర్‌వైజర్ సాయిలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీశారు. విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం పులిహోర తినడం వల్ల వాంతులయ్యాయని, ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి వైద్యులు వెల్లడించారు. చిన్నారులను రాత్రికి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరివెంట అంగన్‌వాడీ వర్కర్ శ్రీదేవి, చిన్నారుల తల్లిండ్రులు ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం రిజర్వాయర్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. రామాపురం డ్యాం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయాన్ని స్థానికులు గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమితం శ్రీకాళహిస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద రెండు సెల్‌ఫోన్లు, రూ.10 వేల నగదు ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన ఆధారాలు ఏమీ లేకపోవడంతో గుర్తితెలియని మృతదేహంగా కేసు నమోదుచేశారు.
అంగన్‌వాడీ చిన్నారులకు అస్వస్థత


