వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యం
వెంకటగిరి(సైదాపురం):ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వెంకటగిరి మున్సిపాలిటీలో టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మా నం వీగిపోతుందని, వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్య మని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఎన్‌జేఆర్ భవన్‌లో ఆయన కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. నేదురుమల్లి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ జెండాతో 25 మంది కౌన్సిలర్లు విజయం సాధించారన్నారు. ఈ క్రమంలో కూట మి నేతలు కొందరిని ప్రలోభాలకుగ గురి చేసి అక్రమంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ చేశామని, ధిక్కరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. 19 మంది కౌన్సిలర్లు తమ వెంటే ఉన్నారని, మిగిలిన ఆరుగురు సైతం వైఎస్సార్‌సీపీకే ఓటేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను దించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని వివరించారు. కూటమి నేతలు కుట్రలకు తెరతీయకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.
అభివృద్ధే మా లక్ష్యం
వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తమ కుటుంబం పనిచేస్తోందని తెలిపారు. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు కృషి చేశామని, 100 ఎకరాల్లో నగరవనం ఏర్పాటు చేశామని వివరించారు. రూ.110 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు తీసుకువచ్చామని వెల్లడించారు. కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధించే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. అలాగే పారవోలు ఎంపీటీసీ సభ్యులు పుల్లూరు శ్రీదేవిని అవమానించడం హేయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జెడ్పీ చైర్మన్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, విప్ పి.లక్ష్మి, కౌన్సిలర్లు కందాటి కల్యాణి, వహీదా, ధనియాల రాధ, ఆరి శంకరయ్య, సుకన్య, యచ్చా విజయలక్ష్మి, శివకుమార్, సుబ్బారావు, తుపాటి సుజాత, ఆటంబాకం శ్రీనివాసులు, మాడా జానకిరామయ్య, పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, పార్టీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.


