అంతా మహిళలే | Sakshi
Sakshi News home page

అంతా మహిళలే

Published Wed, Nov 22 2023 12:34 AM

- - Sakshi

ఇక్కడ పనిచేసేవారంతా మహిళలే. చేనేత మహిళా కార్మికులు తమ ఇళ్లల్లోనే మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఇంటిల్లిపాదీ కాటన్‌ పట్టు చీరలు నేస్తుంటారు. నాణ్యత గల చీరలను తయారుచేసే వారంతా మహిళలే ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు మాత్రమే ఈ కాటన్‌ చీరలను నేయగలరు. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు మాత్రమే ఇక్కడ ఉపాధి కల్పిస్తుంటారు.

సైదాపురం: వెంకటగిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో బంగారుపేట గ్రామం ఉంది. ఈ గ్రామంలో 680 చేనేత కుటుంబాలున్నాయి. వారంతా మగ్గాల ద్వారానే చీరలను నేస్తున్నారు. కాటన్‌ చీరల తయారీలో ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉపాధి దొరుకుతోంది. ఇక్కడ పనిచేసే కూలీలంతా మహిళలే. అఆలు కూడా రాని ఆ మహిళలు నైపుణ్యం గల కాటన్‌ చీరలు తయారు చేస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో అత్యానిధునిక పరికరాలు వస్తున్న ఈ రోజుల్లో కూడా మగ్గాలనే ఉపయోగిస్తూ అద్భుతమైన కాటన్‌చీరలు తయారు చేస్తూ మగువుల మనసు దోచుకుంటున్నారు.

ఎలా తయారు చేస్తారంటే?

కాటన్‌ చీరకు అవసరమైన ముడిసరుకును వివిధ రకాల పరిమాణంలో వేరుచేస్తారు. చేనేత యాజమానుల నుంచి నూలు తెచ్చుకుంటారు. చీరలు తయారు చేసే ముందు సాగళ్లు తెచ్చుకుని అచ్చు ఎత్తుకుని అల్లు పట్టుకుంటారు. అనంతరం దోనేకు చుట్టుకుని మగ్గంపై చీరను తయారుచేసేందుకు సిద్ధంచేస్తారు. రాట్నం ద్వారా కండెలను ఒడికి బంకలో నానబెట్టి అల్లికచేస్తారు. తర్వాత వివిధ రకాల డిజైన్లలో కాటన్‌ పట్టు చీరలను తయారు చేస్తారు. వారమంతా ఇంటిల్లిపాదీ కష్టపడితే 5 కాటన్‌ పట్టు చీరలను నేస్తారు.

లేటెస్ట్‌కు నాలుగైదు రోజులు

లేటెస్ట్‌ డిజైన్‌ తయారు చేయాలంటే నాలుగైదు రోజులు పడుతుంది. దీనికి రూ.4 వేలు ఇస్తారు. మామూలు సాధారణ డిజైన్‌ చీరను ఒక్క రోజులో నేస్తారు. తెల్లవారుజాము నుంచి చేనేత పనుల్లో మహిళలు నిమగ్నమవుతుంటారు. ఆధునిక యంత్రాలు రావడంతో కాటన్‌పట్టు చీరలు తయారు చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఈ ప్రాంతంలో తయారు చేసే కాటన్‌ పట్టు చీరలకు మంచి డిమాండ్‌ ఉండడంతో స్థానికులు దీనిపైనే ఆధారపడ్డారు. ఈ ప్రాంతంలో తయారుచేసే కాటన్‌పట్టు చీరలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

కాటన్‌ పట్టు చీరలకు పుట్టినిల్లు

‘బంగారుపేట’

ఇక్కడ తయారుచేసే

కాటన్‌ చీరలకు భలే డిమాండ్‌

చీరలు నేసే వారంతా మహిళలే

2వేల కుటుంబాలకు జీవనోపాఽధి

1/3

చీరను మడతపెడుతున్న చేనేత కార్మికులు
2/3

చీరను మడతపెడుతున్న చేనేత కార్మికులు

3/3

Advertisement
 

తప్పక చదవండి

Advertisement