పెరిగిన నిర్వహణ, మరమ్మతు ఖర్చుల సాకు
ప్రైవేటు డెయిరీలతో కుమ్మక్కయారన్న ఆరోపణలు
పాడిని నమ్ముకుని బతుకుతున్న మహిళా పాడి రైతులు వారు.. పదిహేను రోజులకోసారి డబ్బులు వస్తే కొంత అవసరాలకు వినియోగించుకుని, మిగిలిన మొత్తం పాడి పశువులకు గడ్డి, దాణా కొనుగోలు చేసుకుంటారు..పాల శీతలీకరణ కేంద్రం మూసి వేత దిశగా బాబు సర్కారు అడుగులు.. రైతుల నుంచి సేకరించిన పాలను మరో శీతలీకరణ కేంద్రానికి తరలింపు.. సుదూర ప్రయాణంతో చెడిపోతున్న క్షీరం.. వెరసి పాల సొమ్ము చేతికి రాక.. ఏమి చేయాలో పాలుపోక, వారు విలవిల్లాడుతున్నారు. ఇదీ నేడు వరదయ్యపాళెం పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని మహిళా పాడి రైతుల దుస్థితి.
వరదయ్యపాళెం: గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు ఆర్థికాభివృద్ధి, పాడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వరదయ్యపాళెంలో ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రం మూసి వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దిశగా తెర వెనుక కార్యాచరణ సిద్ధం చేసింది. ఓవైపు అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు డెయిరీలతో కుమ్మకై రోజువారీ పాల సేకరణను రోజురోజుకు తగ్గించేశారు. దీంతో ఇప్పుడు పాల సేకరణ తగ్గిపోయిందన్న సాకు చూపుతూ మరోవైపు పాల శీతలీకరణ కేంద్రం నిర్వహణ భారం అధికమవుతుందని భూతద్దంలో చూపుతూ మూసి వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ద్వారా నడుపుతున్న పాల శీతలీకరణ కేంద్రాన్ని నమ్ముకున్న 400 మంది మహిళా పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పాలకు సంబంధించి తమకు ప్రైవేటు డెయిరీల కంటే ఎక్కువ గిట్టుబాటు ధర కల్పిస్తున్న పాల కేంద్రాన్ని మూసి వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పాల శీతలీకరణ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రైవేటు డెయిరీలతో కుమ్మకై పేద వారి జీవనోపాధిపై పొట్టకొట్టడమేనని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2008లో ఏర్పాటు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జనవరి 30, 2008వ సంవత్సరంలో అప్పటి జిల్లా మంత్రి చెంగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి చేతుల మీదుగా వరదయ్యపాళెంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆ కేంద్రం అభివృద్ధి పథంలో నడుస్తూ మండలంలో పాడి రైతులకు అండగా నిలిచింది. రోజువారీ గతంలో 3 వేల లీటర్ల వరకు పాల సేకరణ జరిగేది. అయితే ప్రస్తుతం సీజన్‌కు అనుగుణంగా 1500 లీటర్ల నుంచి 2వేల లీటర్ల వరకు సేకరణ జరుగుతుంది. మండలంలోని 29 పంచాయతీల నుంచి దాదాపుగా 400 మంది మహిళా పాడి రైతులు ఉత్పత్తిదారులుగా ఉన్నారు. ప్రైవేటు డెయిరీల కంటే ప్రభుత్వ పాలశీతలీకరణ కేంద్రం నుంచి ఆవు పాలు లీటరుకు రూ.35 నుంచి రూ.40, గేదె పాలు లీటరు రూ. 50 నుంచి రూ.75 వరకు గిట్టుబాటు ధర లభిస్తున్నట్లు పాడి రైతులు చెబుతున్నారు. పేదల జీవనోపాధికి ఎంతో అవసరమైన కేంద్రాన్ని మూసి వేయడంపై పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
మూసివేత దిశగా ప్రభుత్వం నిర్ణయం
20 రోజులుగా బీఎన్‌కండ్రిగ కేంద్రానికి
పాలు తరలింపు
ఆందోళన చెందుతున్న 400 మంది పాడి రైతులు
మరమ్మతు సాకు
వరదయ్యపాళెంలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని దాదాపుగా మూసి వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా కూలింగ్ మిషన్లు పాడైపోయాయని, వాటిని మరమ్మతు చేయాలంటే రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చు భరించలేక పాలశీతలీకరణ కేంద్రాన్ని మూసి వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 20 రోజులుగా వరదయ్యపాళెం మండలంలో సేకరించిన పాలను బీఎన్ కండ్రిగ పాలకేంద్రానికి తరలిస్తున్నారు. అయితే బీఎన్‌కండ్రిగకు పాల తరలింపులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా పాలు చెడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.


