భూమికి ఎసరు.. | - | Sakshi
Sakshi News home page

భూమికి ఎసరు..

Mar 19 2026 7:36 AM | Updated on Mar 19 2026 7:36 AM

రూ.కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణ

రెవెన్యూ అధికారులు అడ్డుకున్నా.. మరోసారి నిర్మాణాలు

తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌కి సమీపంలో ఫ్లైఓవర్‌ కింద ఆక్రమణ

రెవెన్యూ రికార్డుల్లో కాలువ పోరంబోకు అని ఉన్నా దర్జాగా కబ్జా

అది కాలువ పోరంబోకు స్థలం..రూ.కోట్ల విలువ చేస్తుంది.. అది కూటమి నేతల చెరలో చిక్కుకుంది.. ఖరీదైన భూమిపై కన్నేసి, నిర్మాణం చేపట్టారు.. ఆ విషయం సాక్షి వెలుగులోకి తెచ్చింది.. మండల రెవెన్యూ ఉన్నతాధికారి ఆక్రమణను అడ్డుకున్నారు. కొన్నాళ్లు నిర్మాణం ఆపేసిన వారికి మీరేం కంగారుపడొద్దు.. నేనున్నాగా.. ఏదో ఒకటి చేస్తా.. కాలువ పోరంబోకు భూమే కదా.. కట్టేసుకోమని రెవెన్యూ అధికారి సలహా ఇచ్చారు. ఇంకేముంది మళ్లీ నిర్మాణం మొదలు పెట్టేశారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రూ.కోట్ల విలువ చేసే కాలువ పోరంబోకు భూమిపై కన్నేసిన కూటమి నేతలు ‘నిన్నొదల.. బొమ్మాళీ’ అన్న చందంగా మరోసారి అక్రమ నిర్మాణానికి తెరలేపారు. గతంలో ఇదే స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయని సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చాక రెవెన్యూ అధికారులు స్పందించి, ఆక్రమణను అడ్డుకున్నారు. రెండు నెలల పాటు మౌనంగా ఉన్న కూటమి నేతలు మరోసారి బరితెగింపునకు దిగారు. రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడంతో మరోసారి దర్జాగా పక్కా కట్టడాన్ని చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ సమీపం.. రామానుజకూడలి పక్కన, గరుడ వారధి కింద సర్వే నంబర్‌ 43/1లో 2.40 ఎకరాలు కాలువ పోరంబోకు భూమి ఉంది. వర్షం వస్తే ఆ కాలువలో వరదనీరు ప్రవహిస్తుందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ భూమిని 22ఏ కింద చేర్చింది. 43/1లోని ఆ భూమి మొత్తం ముళ్లచెట్లతో నిండిపోయి ఉండేది. మూడేళ్ల కిందట అదే భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా గత ప్రభుత్వంలోని అధికారులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అందులోకి ఎవరూ ప్రవేశించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.కోట్ల విలువచేసే కాలువ పోరంబోకు భూమిపై పడింది. రెవెన్యూశాఖలోని ఓ అధికారి సహకారంతో జనసేన, టీడీపీ నేతలు అక్రమ నిర్మాణానికి తెగబడ్డారని తెలిసింది. నిత్యం రాకపోకలు సాగించే రోడ్డు పక్కనే ఉన్న కాలువ పోరంబోకు స్థలం ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం అంకణం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. విలువైన కాలువ పోరంబోకు భూమిలో దర్జాగా పక్కా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ అధికారి సహకారంతోనే గతంలో నిర్మాణాన్ని అడ్డుకున్నా మరోసారి బరితెగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ మొదలెట్టేశారు!

ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు

అది కాలువ పోరంబోకు భూమే. అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. మా సిబ్బందిని పంపి, ఆక్రమణలను తొలగిస్తాం. – సురేష్‌ బాబు,

అర్బన్‌ తహసీల్దార్‌, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement