వేసవి తరువాతే జెడ్పీటీసీ ఎన్నికలు! | ZPTC elections after summer | Sakshi
Sakshi News home page

వేసవి తరువాతే జెడ్పీటీసీ ఎన్నికలు!

Apr 19 2026 5:23 AM | Updated on Apr 19 2026 5:23 AM

ZPTC elections after summer

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

భూముల ధరల పెంపుపై కసరత్తు

భూ పటం ఆధారంగా ఈనెల 20న పాలేరులో తొలి రిజిస్ట్రేషన్‌ 

త్వరలోనే నామినేటెడ్‌ పదవుల పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వేసవి తరువాత జరిగే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. శనివారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భూముల ధరల సవరణ జరగలేదని, భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. 

భూముల ధరపై గతంలో కొంత కసరత్తు జరిగిందని, త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లను ఇకపై భూ పటం (ల్యాండ్‌ మ్యాప్‌)తో ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తొలి రిజిస్ట్రేషన్‌ను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. 

త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ధరణిలో భూముల విషయంలో జరిగిన తప్పులను భూభారతిలో పూర్తిగా పరిష్కరించనున్నట్లు వివరించారు. అసైన్డ్‌ భూములకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ భూములకు సంబంధించి నాలుగు అంశాలపై ఒక కసరత్తు జరిగిందని, త్వరలోనే ఈ అంశాన్ని కూడా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. 

వరంగల్‌ ఎయిర్‌పోర్టు పనులు త్వరగా ప్రారంభం కావాలి
పౌర విమానయాన శాఖతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా ప్రారంభం అయ్యేలా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినందున వీలైనంత తొందరలో వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అయ్యేలా చూడాలని అన్నారు. 

శనివారం సచివాలయంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ సదరన్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజ్‌ కిశోర్, ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి తదితరులతో ఆయన కొత్త విమానాశ్రయాల పరిస్థితిపై సమీక్షించారు. రక్షణ శాఖ సొంతంగా చేపట్టబోయే ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ను తక్షణమే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.  

Advertisement
 
Advertisement
Advertisement