ప్రజల ఆకాంక్షను పూర్తి చేసే వరకు ప్రజా ప్రస్థానం ఆగదు: వైఎస్‌ విజయమ్మ

YS Sharmila Successfully Completed 1000 kM Padayatra - Sakshi

సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపడుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సత్తుపల్లి మండలం తాళ్ళమడ వద్ద 1000 కిలోమీటర్లు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మించిన వైఎస్సార్ పైలాన్‌ను వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం సత్తుపల్లి బస్టాండ్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. షర్మిలమ్మ పాదయాత్రకు మద్దతుగా వచ్చిన అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తి చేసే వరకు ప్రజా ప్రస్థానం ఆగదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ పాదయాత్ర సరికొత్త చరిత్ర సృష్టించింది. మాట తప్పని మడమ తిప్పని నేత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల. అందరి సంక్షేమం కోసమే షర్మిల పాదయాత్ర. రాజశేఖర్‌రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలమ్మ.

సంక్షేమంలో తెలంగాణకు వైఎస్సార్‌ పెద్దపీట వేశారు. రాజశేఖర్‌రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిది. వైఎస్సార్‌ చనిపోయాక ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి ఆ కుటుంబాన్ని వేధించారు. జగన్‌ను అక్రమంగా నిర్భందించినపుడు 3012 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర మరలా చేయాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. బంగారు తెలంగాణ కోసం, గొప్ప సంకల్పంతో పాదయాత్రతో షర్మిల మీ ముందుకు వచ్చింది ఆశీర్వదించండి' అని వైఎస్‌ విజయమ్మ కోరారు. 

చదవండి: (పాలమూరుపై టీఆర్‌ఎస్‌ కక్ష కట్టింది: బండి సంజయ్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top