శభాష్‌ బాబు.. ఆయన చిత్రం సజీవ దృశ్యం

Young Man Talent In Digital Art In Rajanna Sircilla District - Sakshi

డిజిటల్‌ ఆర్ట్‌లో రాజన్నసిరిసిల్ల జిల్లా యువకుడి ప్రతిభ

పసి వయసు నుంచే అద్భుత చిత్రాలు అతడి సొంతం

ఏపీ సీఎం జగన్‌తో శభాష్‌ అనిపించుకున్న బాబు

అంతర్జాతీయ స్థాయి పెయింటింగ్స్‌ లక్ష్యం

సిరిసిల్ల కల్చరల్‌: అతను చిత్రం గీస్తే సజీవ దృశ్యం అన్న భావన కలుగుతుంది. అత్యంత అలవోకగా గీసే రేఖాచిత్రాల్లో సైతం అరుదైన సృజనాత్మకతను ప్రదర్శించే నైపుణ్యం ఆయనకే సొంతం. పుస్తకాల ముఖచిత్రాలు, లోపల సందర్భానుసారం వచ్చే బొమ్మలు, వివిధస్థాయిల్లోని రాజకీయ నాయకుల చిత్రపటాలు అతని చేతిలో శాశ్వతత్వాన్ని ఆపాదించుకుంటాయి. పసి వయసు నుంచే పెంచుకున్న అభిరుచి అంచెలంచెలుగా పరిణామం చెంది చెయ్యి తిరిగిన కళాకారుడిగా ఎదిగిన ఆయనే దుండ్రపెల్లి బాబు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని గీసి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిని ఆకర్షించాడు.

ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడమే లక్ష్యం
మా ఊరులో ఉన్న సొంత ఇల్లు, కొంత పొలం, మిడ్‌ మానేరు డ్యామ్‌ నిర్మాణం కారణంగా మునిగిపోయింది. చిన్న కుటుంబం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. నా కళే నా పెట్టుబడి. చేతిలో ఉన్న కళనే పూర్తిగా నమ్ముకున్నా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న. ఎప్పటికైనా సరే అంతర్జాతీయ స్థాయి ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలన్నది నా సంకల్పం.
 – దుండ్రపల్లి బాబు

పేద కుటుంబం నుంచి
తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన దుండ్రపెల్లి లక్ష్మి, దుర్గయ్య రెండోసంతానంగా 1988లో జన్మించా డు బాబు. పేద వ్యవసాయ కుటుంబం. ఆర్థిక వనరుల లేమితో చొప్పదండిలోని తన మేనమామ దగ్గర పెరిగా డు.పదోతరగతి వరకు మంథనిలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో, రుక్మాపూర్‌లో ఇంటరీ్మడియట్‌ పూర్తిచేసి, జెఎన్‌టీయూ నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా తనకు ఎంతో ఇష్టమైన బ్యాచ్‌లర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరిపోయాడు. 2014లో బీఎఫ్‌ఏ పూర్తి చేసి ఆరో అనే కంపెనీలో ఇలస్ట్రేటర్‌గా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేశాడు. మరింత నైపుణ్యాల కోసం ఎంఎఫ్‌ఏలో చేరాడు.

ఇదీ.. బాబు ప్రతిభ
2016లో ఎంఎఫ్‌ఏ పూర్తయ్యాక పుస్తకాలకు వేసే ముఖపత్రాలకు అందమైన ఇలస్ట్రేషన్‌ ఇవ్వడంతో పేరు తెచ్చుకున్నాడు. ఓ ప్రవాస భారతీయుడి కోరిక మేరకు ‘చిన్ననాటి ఆటలు. జ్ఞాపకాల మూటలు’ అనే పుస్తకానికి సుమారు 100 చిత్రాలు గీసి ఇచ్చారు. కందుకూరి రాము, శివజాస్తితో కలిసి చేసిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇచ్చింది.

రామాయణం, మహాభారతం సహా అంతర్జాతీయస్థాయి పుస్తకాలకు వేసిన చిత్రాలు ఆదరణ పొందాయి. భారతీయ నేపథ్య వస్త్రాలంకరణతో రూపొందించిన రాజులు, చక్రవర్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నేతలు సుమారు 500 క్యారెక్టర్ల చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. మరో వందచిత్రాల రూపకల్పన కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చలనచిత్రాలకు సంబంధించిన స్టోరీబోర్డు వర్క్‌లో బిజీగా ఉంటున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్రానువాద స్క్రిప్ట్‌తో చిత్రాలకు అక్కడికక్కడే గీసి ఇవ్వడం మనోడి ప్రత్యేకత. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top