భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే హత్య | Sakshi
Sakshi News home page

భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే హత్య

Published Tue, Mar 12 2024 10:07 AM

Young Man Murder in Jagtial - Sakshi

రాయికల్‌: తన భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే నాగెల్లి భూమేశ్‌.. సురేశ్‌ అనే యువకుడిని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. శుక్రవారం జరిగిన హత్య నేరానికి సంబంధించిన వివరాలను సోమవారం రాయికల్‌ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాయికల్‌ మండలం తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్‌ వరుసకు అన్నదమ్ముల్లు. భూమేశ్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. ఈ క్రమంలో సురేశ్‌ భూమేశ్‌ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా సురేశ్‌ పట్టించుకోలేదు. 2023 అక్టోబర్‌లో దుబాయ్‌ నుంచి ఇంటికి వసూ్తనే సురేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని గమనించాడు.

 దీంతో సురేశ్‌పై పగ పెంచుకుని, ఎలాగైనా చంపాలని అనుకుని ఈనెల 7న ఉదయం పొలం వద్దకు నీరు పెట్టడం కోసం సురేశ్‌ వెళ్లడాన్ని గమనించాడు. ప్లాన్‌ ప్రకారం కత్తిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి కొద్దిదూరంలో ఉన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనాన్ని పెట్టాడు. తన పొలానికి నీరు పెట్టేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సురేశ్‌ను ఆపి తాను పొలానికి వస్తున్నానని చెప్పాడు. పొలం గట్టుదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపగానే భూమేశ్‌ వెంట తెచ్చుకుని కత్తితో సురేశ్‌ తల, మెడపై విచక్షణరహితంగా నరికాడు. కిందపడిన సురేశ్‌ ప్రాణభయంతో బావి వైపు పరుగెత్తుతుండగా మరోసారి నుదుటిపై, తలపై కత్తితో నరికాడు. 

దీంతో తీవ్రంగా గాయాలైన సురేశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్‌ మృతదేహాన్ని అదేబావిలోకి తోసేశాడు. కత్తిని కూడా అదే బావిలో పడేశాడు. రక్తం మరకలు శుభ్రం చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికొచ్చి స్నానం చేసి అనంతరం వేములవాడ రాజన్న (శివరాత్రి జాతర) దర్శనానికి వెళ్లాడు. సురేశ్‌ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే సురేశ్‌ బావిలో శవమై కనిపించాడు. హత్య విషయాన్ని తెలుసుకున్న రూరల్‌ సీఐ ఆరీఫ్‌ అలీఖాన్, ఎస్సై అజయ్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

సురేశ్‌ తల్లి నాగేల్లి లక్ష్మి భూమేశ్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన సమాచారం మేరకు బావిలో పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో వినియోగించి రెండు మొబైల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్న సీఐ, రాయికల్‌ ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. 

Advertisement
 
Advertisement