
అక్కను చంపిన తమ్ముడు
హైదరాబాద్: సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది.
రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్‌లో దినేశ్‌తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.
ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు.