ఆ పంట వేశా.. ఆకారం వినూత్నంగా ఉండడంతో ఎగబడి కొంటున్న జనం!

Yellow Watermelon Gives Profits To Farmer Karimnagar - Sakshi

వీణవంక(హుజూరాబాద్‌): ఏళ్లుగా వరి సాగు చేయడంతో భూసారం దెబ్బతింటుంది. దీనికి తోడు ధాన్యం విక్రయించడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో పుచ్చ సాగును ఎంచుకున్నాడు. కొత్తరకం వంగడాలను తీసుకొచ్చి సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన రైతు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి. తనకున్న ఆరెకరాల్లో నాలుగెకరాలు సాగు చేశాడు. ప్రస్తుతం రెండెకరాల్లో కోత పూర్తయింది. మరో రెండెకరాలు పూత దశలో ఉంది. ఏప్రిల్‌లో కోతకు రానుంది. ఒకే సారి నాలుగెకరాల్లో పంట వేస్తే కోత ఒకేసారి వస్తుంది. దీంతో కాయలకు డిమాండ్‌ తగ్గుతుందనే ఆలోచనతో ఈ విధంగా సాగు చేశాడు. మరో ఎకరంలో మిర్చి, మిగిలిన ఎకరంలో వరి సాగు చేశాడు.

రెండేళ్లుగా సాగు..
తనకున్న ఆరెకరాల్లో 20ఏళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. ఒకే రకమైన పంట ఏళ్లుగా వేస్తుండడంతో దిగుబడి తగ్గి పెట్టుబడి పెరిగింది. దీంతో డ్రిప్, మల్చింగ్‌ పద్ధతిలో పుచ్చ సాగు చేయగా గతేడాది 100టన్నుల దిగుబడి వచ్చింది. ఖర్చులు పోనూ రూ.2లక్షల ఆదాయం సమకూరింది. కలుపు నివారణకు మల్చింగ్‌ పద్ధతిని ఎంచుకున్నాడు. నీటి తడులు తగ్గించేందుకు డ్రిప్‌ ఏర్పాటు చేశాడు. 

‘ఎల్లో’ పుచ్చకు డిమాండ్‌
గతేడాది తెల్లపుచ్చ సాగు చేయగా ఈసారి ‘ఎల్లో’పుచ్చను రెండెకరాల్లో సాగు చేశాడు. రిలయన్స్‌ కంపెనీకి 10టన్నుల పంటను కిలోకు రూ.20 చొప్పున విక్రయించాడు. ఒక్కో కాయ 3నుంచి 4కిలోల బరువు ఉంది. మరో 5టన్నులు చేను వద్దకే వచ్చి ప్రజలు కొన్నారు. మరో రెండెకరాల్లో పంట పూత దశలో ఉంది. ఎల్లో పుచ్చ ఆకారం వినూత్నంగా ఉండటంతో ప్రజలు కొనుగోలుకు మొగ్గు చూపినట్లు రైతు తెలిపాడు. 

పచ్చి మిర్చికీ ఆదాయం
గతేడాది ఎకరంలో అరటి పంట వేయగా దిగుబడి రాలేదు. దీంతో ఈసారి ఎకరంలో మిర్చి వేశాడు. చేను ఏపుగా పెరిగి దిగుబడి బాగా వచ్చింది. 10క్వింటాళ్ల పచ్చిమిర్చికి రూ.90వేల ఆదాయం వచ్చినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపాడు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే అధిక లాభాలు అర్జించవచ్చని నిరూపించాడు.

ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే..
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఉద్దేశంతో పుచ్చ సాగును ఎంచుకున్న. ఆరెకరాల పొలం మడులను చెడగొట్టి చెలక చేసిన. చేను చుట్టూ నీరు నిల్వ ఉండకుండా కందకాలు కొట్టిచ్చిన. పుచ్చ పంటతో మంచి లాభం వచ్చింది. పచ్చి మిర్చి మీదమీదనే అమ్ముడు పోయింది. వచ్చే ఏడాది కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తా. రైతులు కూడా ఒకేరకం కాకుండా ఇతర పంటల వైపు చూడాలి.           – కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, మామిడాలపల్లి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top