Hyderabad: 50% మంది మహిళలకు ఒకే సమస్య.. కారణమదే అంటున్న వైద్యులు

World Health Day: 51 Percent Of Women In Hyderabad Are Obese Says Report - Sakshi

 నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య 15వేల దాకా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు లక్ష మంది దాకా ఉంటారని కేర్‌ ఆస్పత్రి వైద్యుడు డా.వంశీకృష్ణ చెబుతున్నారు. మొత్తం కిడ్నీ రోగుల్లో 40 శాతం మందికి అధిక రక్తపోటుతో కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారాయ. దురదృష్టకర విషయమేంటంటే వీరిలో ఎవరికి తాము రక్తపోటు బాధితులమని తెలియకపోవడం.

తాజాగా నగరానికి చెందిన 51 శాతం మంది మహిళలు అధిక బరువుతో లేదా తమ బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 25కేజీ/ఎమ్‌2 కన్నా ఎక్కువగా లేదా సమానమైన ఒబెసిటీతో బాధపడుతున్నారని కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ (సీఎస్‌డీ) వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ కోసం ప్రచురించినదీ సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన వివరాలతో రూపొందించిన గణాంకాలివీ. దీనిలో నగరం అత్యధిక శాతం అధిక బరువున్న మహిళలతో ముందంజలో ఉండడం గమనార్హం. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

అన్నీ ఉన్నా...ఆరోగ్యం? 
నిజానికి నగరంలో విద్యాధికులకు కొదవలేదు. వైద్య సౌకర్యాలకు కొరత లేదు. అయినప్పటికీ డయాబెటిస్‌ మొదలుకుని ఏ వ్యాధికి సంబంధించి చూసినా నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పలుమార్లు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, జంక్‌ ఫుడ్, ఫాస్ట్‌ ఫుడ్‌ వినియోగం, సూర్య కాంతికి ఎక్కువగా తగలకపోవడం... వంటివి నగర మహిళల్ని అధిక బరువు దిశగా నడిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

‘కోవిడ్‌ నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వంటి పద్ధతులు కొత్తగా వచ్చాయి. ఈ పరిణామం చాలా మందిని ఊబకాయులుగా మార్చింది. నగరాల్లో ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం’ అని న్యూట్రిషనిస్ట్‌ సుజాత స్టీఫెన్‌ అభిప్రాయపడ్డారు.  

వేగం.. నగర జీవననాదం.. 
నగర జీవనంలో ఉరుకులు పరుగులు సర్వసాధారణంగా మారాయి. రోజుకు 24 గంటలు ఉంటున్నా సరిపోవడం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనికి మరోవైపు సోషల్‌ మీడియా సరికొత్త సోమరితత్వాన్ని మోసుకొస్తోంది. దీంతో ఆహారపు అలవాట్లు ఛిన్నా భిన్నమయ్యాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా ఆహార విహారాలు మారడంతో అనారోగ్యాలు వెంటాడుతున్నాయి.

‘మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటివి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం’ అని కిమ్స్‌ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్, డాక్టర్‌ వేదస్విరావు వెల్చల చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top