
బంజారాహిల్స్(హైదరాబాద్): మాజీ ప్రియురాలిపై దాడికి పాల్పడటమే కాకుండా ఆమె తాజా బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేసన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన కోటి అఖిల్‌కుమార్(28) బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ప్రేమించాడు.
ఇద్దరూ కలిసి ఉన్నత చదువుల కోసం పోలాండ్ దేశానికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మాజీ ప్రియుడు అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను తరచూ వెంబడిస్తూ ఆమె రాకపోకలపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి క్యాబ్‌లో తార్నాకలోని తన గదికి వెళ్తుండగా ఆమెను అనుసరించి ఆమెకు తెలియకుండా నేరుగా ఆమె గదిలోకి వెళ్లి తాజా ప్రియుడితో కలిసి ఉండగా ఫొటోలు తీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఆమె సెల్‌ఫోన్ లాక్కొని అందులో డేటాను తొలగించి ధ్వంసం చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కన్ను, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.