వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు!

Woman In Nizampet Taking Care Of Street Dogs - Sakshi

నిత్యం ఆహారం అందించడం

గాయపడిన వాటికి చికిత్స చేయడం

పలువురి మన్ననలు పొందుతున్న సాయిశ్రీ రెడ్డి 

సాక్షి, నిజాంపేట్‌: అందరూ కుక్కలు అంటేనే భయపడతారు.. కాని కొందరే వాటిని ప్రేమిస్తారు. అంటువంటి వారిలో సాయిశ్రీ ఒకరు అని చెప్పవచ్చు.. మన పక్కనున్న వారినే పట్టించుకోని ఈ రోజుల్లో.. వీధుల్లో తిరుగుతున్న శునకాలను ఓ యువతి చేరదీసి అన్నీ తానై కంటికి రెప్పలా వాటిని కాపాడుతోంది. వాటి పోషణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆపాయ్యతను పంచడంలో ఎక్కడా హెచ్చుతగ్గులు చూపిండం లేదు. వివరాలు.. బాచుపల్లిలోని ఆదిత్య గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న సాయిశ్రీ రెడ్డి బాక్సింగ్‌ చాంపియన్‌. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన అనేక పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించింది.

కాగా గత సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా హోటల్స్, ఫంక్షన్‌ హాళ్లను మూసివేయడంతో సరిపడా ఆహారం దొరక్క తల్లడిల్లిన వీధి కుక్కుల పరిస్థితి చూసి ఆమె చల్లించిపోయింది. వాటి సంరక్షణకు నడుం బిగించింది. ప్రగతినగర్‌లోని సింహపురి కాలనీలో ఓ గోదాములో వీధి కుక్కలను ఉంచి వాటికి ప్రతి రోజు ఆహారం అందించడం ప్రారంభించింది. శునకాల ఆలనా పాలాన చూసుకునే బాధ్యతను తన  భుజాన వేసుంది. ఇందు కోసం ప్రతి నెలా సుమారు రూ. 30 వేల వరకు వెచ్చిస్తుండటం గమనార్హం. 

తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో .. 
► వీధి కుక్కల సంరక్షకు సాయిశ్రీ  తల్లిదండ్రులైన ఈశ్వర్‌రెడ్డి, సు«ధల సహకారంతో పాటు స్నేహితులు, బంధువుల సహకారం కూడా తీసుకుంటోంది. 
►తమ కుమార్తె చేస్తున్న పనికి తల్లిదండ్రులు కూడా చేదోడువాదోడుగా నిలవడం గమనార్హం. 
►గాయపడిన కుక్కులకు చికిత్స.... 
►వివిధ ప్రమాదాల్లో గాయపడిన కుక్కలను, మనుషుల దాడిలో గాయపడిన శునకాలను అక్కున చేర్చుకుని అవసరమైన చికిత్స చేయించి గాయాలు మానే వరకు వాటిని   పూర్తి స్థాయిలో సంరక్షిస్తోంది. 
►కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో  ఎక్కడ ఎలాంటి సందర్భంలోనైనా కుక్కలు గాయపడితే వెంటనే సాయిశ్రీకి ఫోన్‌ వస్తుంది. 
►ఇలా ఇప్పటి వరకు 50 వరకు శునకాలను చేరదీసింది. 

ప్రతి రోజు ఆహారం వండాల్సిందే... 
ప్రతిరోజు తన దగ్గర ఉన్న కుక్కలకు ఆహారం చికెన్‌తో, గుడ్లతో వండి అందిస్తోంది. గాయపడిన కుక్కలకు ప్రతి రోజు డ్రెస్సింగ్‌ చేయడం, అవసరమైన మందులు వేయడం చేస్తోంది. అలాగే వృద్ధాప్యం కారణంగా కొందరు తమ పెంపుడు కుక్కలను సైతం రోడ్లపై వదిలేసి వెళుతుంటారు. అలాంటి వాటిని కూడా ఈమె సంరక్షించడం చెప్పుకోదగ్గ విషయం. దీంతో ప్రస్తుతం ఈమె సంరక్షణలో వీధి కుక్కలతో పాటు ల్యాబ్, పామేరియన్‌ లాంటి  బ్రిడ్‌ జాతి కుక్కలు కూడా ఉన్నాయి.

స్థలం లేక పెంపకానికి ఇబ్బంది అవుతోంది..
రోజు రోజుకు కుక్కల సంఖ్య పెరగుతుండటంతో అవసరమైన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మా బంధువు గోదామును గత సంవత్సరం కాలంగా వాడుకుంటున్నాను. కాని అక్కడ వారి పనికి ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం కాని ఎవరైన దాతలు స్పందించి అవసరమైన స్థలం కేటాయిస్తే నా సేవలు మరింత విస్తృత పరుస్తా. కుక్కల ఆహారం కోసం మనసున్న కొద్దిమంది బియ్యం అందిస్తున్నారు. కుక్కలకు మానవత్వంతో ఆహారం అందించాలనుకునేవారు, ఎక్కడైన కుక్కలు గాయాలకు, ప్రమాదాలకు గురైనప్పుడు ఈ నెంబర్‌కు 9949679131 ఫోన్‌ చేసి సమాచారం తెలుపవచ్చు.


– సాయిశ్రీరెడ్డి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top