నవ దంపతుల మధ్య నెలపాటు దూరం

Why Newly Married Couples Are Separated in Ashada Mausam  - Sakshi

సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్‌): ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభకార్యాలు చేయకూడదని పెద్దలు విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. కొత్త దంపతులకు ఆషాఢం విరహ మాసం. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన తరుణం. చూసుకోవడానికి కూడా వీల్లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. మారిపోయిన ప్రస్తుత కాలంలో నెల రోజుల ఎడబాటు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొత్త దంపతుల ఎడబాటు అనివార్యం అనే సంప్రదాయం సడలింపు దిశగా సాగిపోతోంది. ఫార్మాలిటీ కోసం ఓ 5 రోజులపాటు పుట్టింటికి వెళ్లి వస్తే చాలు అనే భావన కొందరు వెలిబుచ్చుతున్నారు. పెద్దల నియమం కూడా మంచికే అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే ఎడబాటు కూడా మంచికే అన్నది పెద్దల నిశ్చితాభిప్రాయం. 

ఆచారం.. ఆంతర్యం ఇవే..
ఆషాఢ మాసం నవ దంపతులను దూరంగా ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త కోడలు అత్తగారి ముఖం చూడకూడదు. అలాగే కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదు అనే ఆచారం తరతరాలుగా వస్తోంది. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవు. మృగశిర నుంచి మొదలయ్యే చినుకుల ఆగమనం.. క్రమంగా ఆషాఢ మాసం ప్రవేశించే సరికి సమృద్ధిగా వర్షాకాలం అవుతుంది. సాగు ప్రధాన వృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాది అదే పనుల్లో తలమునకలవుతారు.

దీంతో కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. పని ఆధారిత ప్రాంతాల్లో చేసే వృత్తిని కాదని మిగిలిన  వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం విధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరిస్తున్నారు.

సంప్రదాయం వెనక శాస్త్రీయత
నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండటం అంత మంచిది కాదంటారు. ఈ సమయంలో గర్భధారణ జరగడం తల్లీబిడ్డలకు అంత క్షేమం కాదు. ఆషా«ఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా  జలాశయాలు, పరిసరాల్లోని నీళ్లు కలుషితం అవుతాయి. ఈ నీటి వినియోగం అనారోగ్యాలకు కారణమవుతుంది. చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చీడపీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్ర వచనం.

ప్రత్యామ్నాయాలు బోలెడు
ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఆ భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్‌ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాల ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది.

దూరంగా ఉండటమే శ్రేయస్కరం
ఆషాఢ మాసంలో విడిగా ఉండటం శ్రేయస్కరమే. ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో అవుతుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శిశువు జన్మిస్తే బాహ్య పరిసరాలను భరించడం కష్టమవుతుంది. ఆషాఢ మాసంతోపాటు పూజలు, నోముల పేరుతో శ్రావణంలో ఎడబాటు కొనసాగిస్తే సంతానోత్పత్తి› సమయాన్ని జూలై, ఆగస్టు వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సుఖ ప్రసవానికి అనువుగా ఉంటుంది.             

– డాక్టర్‌ గీతావాణి, గైనకాలజిస్టు

వివాహ బంధం బలోపేతం
ఆషాఢ మాసం కొత్త దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో  ఈ నియమం చాలా బాగా పని చేస్తుంది. ఆషాఢ మాసంతో పరస్పర అభిప్రాయాలను పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా వివాహ బంధం బలోపేతం అవుతుంది.

– బోయిని గౌతమ్, హారిక

సంప్రదాయాన్ని పాటిస్తున్నాం
పెద్దవాళ్లు ఏ నియమం పెట్టినా అది పిల్లల మంచి కోసమే. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం వల్ల సమస్యేమీ లేదు. పైగా ఇప్పుడు సెల్‌ఫోన్‌ లాంటి సాంకేతిక పరికరాలు మనుషులను కలిపే ఉంచుతున్నాయి. పెద్దవాళ్లు వి«ధించిన నియమ నిబంధనలు శాస్త్రీయ కోణంలోనే చూడకుండా, ఆరోగ్యం దృష్ట్యా పాటిస్తే మేలు కలుగుతుంది. అందుకే మేము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం.

– గూడెల్లి సురేశ్, వాసవి, సాఫ్ట్‌వేర్‌ దంపతులు

5 రోజులు తీసుకెళ్లారు
పిల్లలు బాగుండాలనే పెద్దలు అనేక నియమాలను వి«ధించారు. టైమ్‌తో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకునే కాలంలో ఇలాంటి ఇవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి సంప్రదాయం కోసం ఐదు రోజులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఎడబాటుతో అన్యోన్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆషాఢ నియమం మంచిదే.

– గోవిందు భరత్‌కుమార్‌ (ప్రైవేట్‌ ఉద్యోగి), పద్మజ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top