
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో చెరువులోకి కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు దొడ్డిపట్ల రాములు
అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆగమాగం
వాన ధాటికి పలుచోట్ల కొట్టుకుపోయిన వడ్ల రాశులు
కొనుగోళ్లలో జాప్యం... రైతులకు తప్పని యాతన
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు నష్టపోతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో రైతులు కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. ఖమ్మంలో నష్టం అధికంగా జరిగినట్టు అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది.
కొనుగోళ్లలో ఆలస్యంతోనే...
యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా కోతలు పూర్తయినా, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. లారీల కొరత, మిల్లర్ల కొర్రీలు, గోనె సంచులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాలు మిల్లర్ల మీద ఆధారపడి కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
లారీలు రావడం లేదని, మిల్లర్లు క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తేనే మిల్లులకు ధాన్యం ఇవ్వాలంటున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే చెప్పే పరిస్థితి కరీంనగర్, ఖమ్మం, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. తిరిగి ఆ ధాన్యాన్ని ఎండబెట్టి, తేమ శాతం 17 శాతం వచ్చిన తర్వాత విక్రయించాలంటే ఎన్ని రోజులు ఆగాలో తెలియని పరిస్థితి.
ఆయా జిల్లాల్లో ఇలా....
⇒ ఖమ్మం జిల్లా వైరా మార్కెట్ యార్డులో ఆరబోసిన 3 వేల క్వింటాల ధాన్యం తడిసి ముద్దయ్యింది. కూసుమంచి మండలంలోనూ ధాన్యం తడిసింది.
⇒ మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, బయ్యారం, గార్ల మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ సెంటర్లలో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది.
⇒ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయ్యింది. కమ్మరపల్లి, చీకోడ్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో తరలించకపోవడంతో కాంటాలు పెట్టిన బస్తాలు కూడా తడిసిపోయాయి.
⇒ పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్‌లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది.మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యంలో చేరిన వర్షపు నీటిని శుక్రవారం ఎత్తిపోస్తూ రైతులు కనిపించారు. పోచమ్మవాడ కొనుగోలు కేంద్రంతోపాటు గోపాల్‌పూర్‌లోనూ ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడితే.. చేతికందిన పంట కళ్ల ముందు వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతు బండారి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. డివిజన్‌లోని అయా మండలాల్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోయింది.