మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..!

Wearing Mask Becoming Problem Says Dental Specialist Doctor Chandrakanth - Sakshi

నిరంతరం మాస్కుతో ఇబ్బందులు

గొంతు నొప్పి.. చిగుళ్లవాపు.. బ్లీడింగ్‌ సమస్యలు

ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్‌ చంద్రకాంత్‌ వెల్లడి

సాక్షి,హైదరాబాద్‌: ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కు తప్పనిసరి. కరోనా బారినపడకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాసు్కలు ధరిస్తున్నారు. చాలాసేపు మాస్కు ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఇది పరోక్షంగా గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్‌ సమస్యలకు కారణమవుతోందని దంత వైద్య నిపుణలు చెబుతున్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా నోటిని క్లీనింగ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర చికిత్సలతో పోలిస్తే.. దంత చికిత్సలు ఎమర్జెన్సీ కాకపోవడంతో చాలా మంది వీటిని వాయిదా వేసుకుంటున్నారు. కోవిడ్‌కు భయపడి గతేడాది నుంచి వీటికి దూరంగా ఉంటున్నారు. అయితే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలో సూక్ష్మజీవులు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్లపై ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్‌ చంద్రకాంత్‌ పలు సూచనలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే..

90 శాతం మందిలో దంత సమస్యలు..
ప్రస్తుతం జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక దంత సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మంది పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతుండగా.. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్‌ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. జన సమూహంలోకి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాక్‌ ధరించడం తప్పనిసరిగా మారింది. దీంతో పీల్చిన గాలే పీల్చడంతో నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుంది. నోటి దుర్వాసన, గొంతు నొప్పికే కాకుండా గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుంది.

నోరు ఎండిపోయి సూక్ష్మజీవుల వృద్ధి
నిజానికి 6 నెలలకోసారి దంతాలను క్లీన్‌ చేయించుకోవాలి. లేదంటే దంతాల చుట్టూ పాచీ పేరుకుపోయి వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌కు నిలయంగా మారుతుంది. అనేక మంది చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నారు. దంతాల మధ్యలో పాచీ పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు తలెత్తి దంతాలు పటుత్వాన్ని కోల్పోతాయి. రోజంతా మాస్కు ధరించడం వల్ల మంచినీరు తక్కువగా తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంటుంది. దీంతో దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధికి కారణమవుతుంది. ఇప్పటికే కోవిడ్‌ టీకా తీసుకున్న వారు దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

పిప్పి పళ్లు ఉంటే బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు..
కరోనా బారిన పడి, ఆస్పత్రుల్లో చేరిన వారిలో చాలామందికి స్టెరాయిడ్స్‌ అవసరమయ్యాయి. చికిత్సల్లో భాగంగా అవసరానికి మించి స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల కొందరికి బ్లాక్‌ఫంగస్‌ సోకింది.  స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడి ఇప్పటికే పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఎక్కువ. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాల్లో చిగుళ్లు, దవడ వాపు కూడా లక్షణం కావడంతో ఏది బ్లాక్‌ ఫంగసో? ఏదీ చిగుళ్ల వాపు వ్యాధో? గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది. పిల్లల్లో కూడా దంతాలను సరిగా శుభ్రం చేయకపోవడం, ఏడాదిగా ఫాలోఅప్‌ చికిత్సలకు దూరంగా ఉండటంతో వారిలోనూ దంత సమస్యలు రెట్టింపయ్యాయి.
చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top