Preethi:వేధింపులు నిజమే..మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం!

Warangal Medical Student Preethi Suicide case - Sakshi

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో వాస్తవాలు వెలుగులోకి..

 జూనియర్లు, సీనియర్లతో వాట్సాప్‌ గ్రూపు.

 అందులో ప్రీతి టార్గెట్‌గా సైఫ్‌ వేధింపులు

నిందితుడు అరెస్ట్‌.. తాత్కాలికంగా పరకాల జైలుకు తరలింపు

ఘటనపై సీల్డ్‌ కవర్‌లో డీఎంఈకి చేరిన నివేదిక?

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్‌ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్‌ కాలేజీ, ఎంజీఎం హెచ్‌ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్‌ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్‌ టార్గెట్‌ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఈ కేసులో నిందితుడైన సైఫ్‌ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు.

వాట్సాప్‌ గ్రూపులో వేధింపులతో..
2022 నవంబర్‌లో పీజీ వైద్య విద్యార్థినిగా చేరిన ప్రీతిపై డిసెంబర్‌ నుంచే సైఫ్‌ వేధింపులకు పాల్పడినట్టు వాట్సాప్‌ గ్రూపుల పరిశీలనలో తేలింది. డిసెంబర్‌ 6న సైఫ్, ప్రీతి మధ్య చాటింగ్‌ వార్‌ నడిచింది. తర్వాత కూడా రెండు, మూడుసార్లు చిన్న గొడవలు జరిగినా సద్దుమణిగాయి. అయితే అనస్తీషియా విభాగానికి సంబంధించి 31 మందితో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్‌ గ్రూపులో ఈనెల 18న చేసిన పోస్టుతో గొడవ ముదిరింది. ఓ హౌస్‌ సర్జన్‌ విద్యార్థితో కేస్‌ షీట్‌ రాయించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ప్రీతికి సరైన బ్రెయిన్‌ లేదు.. బుర్ర తక్కువ మనిషి’అంటూ సైఫ్‌ కామెంట్‌ పెట్టాడు.

దీనిని అవమానంగా భావించిన ప్రీతి.. ‘యు మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌’అంటూ వ్యక్తిగతంగా సైఫ్‌కు మెసేజ్‌ పెట్టింది. ఏదైనా ఉంటే తమ హెచ్‌ఓడీకి ఫిర్యాదు చేయాలని, గ్రూపులో తనపై మెసేజ్‌లు పెట్టవద్దని సూచించింది. అంతటితో ఆ వివాదం సమసిపోకపోవడంతో.. ఈ నెల 20న విషయాన్ని తన తండ్రి నరేందర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఏసీపీకి, మట్టెవాడ ఎస్సైలకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు 21న ఉదయం మొదట సైఫ్‌తో, తర్వాత ప్రీతితో మెడికల్‌ కాలేజీ హెచ్‌ఓడీలు మాట్లాడారు.

కానీ ప్రీతి అవమానభారంతోనే ఉండిపోయింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శైలేష్‌ అనే సహ విద్యార్థితో ప్రీతి మాట్లాడుతూ.. ‘‘సైఫ్‌ వేధింపుల విషయంలో నాకు ఎవరూ సపోర్టు చేయడం లేదేం’’అని అడిగింది. ఆ తర్వాత 7.30 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసింది.
నిందితుడి అరెస్టు.. రిమాండ్‌
ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నిందితుడు ఎంఏ సైఫ్‌ను మట్టెవాడ పీఎస్‌ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు. సైఫ్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆధారాల కోసం పరిశీలించారు. పలు అంశాలపై ప్రశ్నించారు. తర్వాత వరంగల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చారు. అయితే బాధితురాలికి వరంగల్‌ ఎంజీఎంలో చేసిన చికిత్స రిపోర్టులు, ఆమె ఆరోగ్య స్థితిపై తాజా వైద్య నివేదికలు సమర్పించలేదంటూ.. నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు జడ్జి చాముండేశ్వరీ దేవి తొలుత తిరస్కరించారు.

తర్వాత పోలీసులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్‌ జారీ చేసిన పత్రికా ప్రకటనను జడ్జికి సమర్పించారు. బాధితురాలి తల్లిదండ్రుల అంగీకారంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించినట్టు వివరించారు. అయితే ఈ సమయంలో జడ్జికి తన వాదన వినిపిస్తానని నిందితుడు సైఫ్‌ కోరాడు. జడ్జి పోలీసులు, న్యాయవాదులు అందరినీ కోర్టు హాల్‌నుంచి బయటికి పంపి నిందితుడు చెప్పిన వివరాలను విని, నోట్‌ చేసుకున్నారు. తర్వాత 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. పోలీసులు సైఫ్‌ను ఖమ్మం జైలు తరలించేందుకు ప్రయత్నించినా.. అప్పటికే రాత్రికావడంతో తాత్కాలికంగా పరకాల జైలుకు తీసుకెళ్లారు. శనివారం ఉదయం ఖమ్మం జైలుకు తరలించనున్నారు.

డీఎంఈకి సీల్డుకవర్‌లో నివేదిక?
ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీలో జరిగిన ఘటనలపై గురు, శుక్రవారాల్లో విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ.. తమ నివేదికను వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ)కు సీల్డ్‌ కవర్‌లో సమర్పించినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్‌ శుక్రవారం ఆరా తీసినట్టు తెలిసింది.

ప్రీతి ప్రశ్నించేతత్వాన్ని తట్టుకోలేక వేధింపులు: సీపీ రంగనాథ్‌
మెడికల్‌ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపులే కారణమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ చెప్పారు. శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామని తెలిపారు. ప్రీతి తెలివైన అమ్మాయి అని, ఇటీవలే వైద్య విభాగానికి సంబంధించి యూపీఎస్సీ ఇంటర్వూ్యకు కూడా హాజరైందని వివరించారు. ఆమెకు ప్రశ్నించే తత్వం ఉందని.. దీనిని తట్టుకోలేకనే సీనియర్‌ అయిన సైఫ్‌ ఆమెను టార్గెట్‌ చేసి వేధించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు తోటి విద్యార్థులు సపోర్ట్‌ చేయడం లేదని మనస్తాపానికి గురైన ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తేలిందని వివరించారు. నిందితుడు సైఫ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, సోషల్‌ మీడియాలో దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం: నిమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప
మెడికల్‌ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. ఆమెకు ఎక్మో, సీఆర్‌ఆర్‌టీ చికిత్స అందిస్తున్నామని నిమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప తెలిపారు. ఆమె బ్రెయిన్‌ ఎంత చురుగ్గా ఉందో తెలుసుకునేందుకు బ్రెయిన్‌ మ్యాపింగ్‌ కూడా చేస్తున్నామని వివరించారు. మంత్రి హరీశ్‌రావు ప్రీతి ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీస్తున్నారని చెప్పారు. ఇక మంత్రి సత్యవతి రాథోడ్‌ శుక్రవారం ప్రీతి తల్లిదండ్రులు శారద, ధరావత్‌ నరేందర్‌లతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉష ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top