2019లో ‘ఉత్తమ’ అధికారి అవార్డు.. ఏసీబీ వలలో సంగెం తహసీల్దార్‌

Warangal: ACB Officials Traps Sangem Tahsildar WhileTaking Bribe - Sakshi

ఆయన ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ అధికారి. పైసా లేనిదే పనిచేయడనే విమర్శలున్నాయి. పనిచేసిన చోటల్లా పైత్యం చూపినట్లు సçహోద్యోగులు చెబుతున్నారు. ఎట్టకేలకూ పాపం పండింది. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 

సాక్షి, వరంగల్‌: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పక్కాగా వల పన్ని పట్టుకున్నారు. సంగెం తహసీల్దార్‌ నరిమేటి రాజేంద్రనాథ్‌ను శుక్రవారం ఉదయం 10 గంటలకు హంటర్‌రోడ్డు నందిహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సంగెం మండల పరిధి కాపులకనిపర్తిలోని వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో సంబంధిత రైతును నాలుగు నెలలుగా తహసీల్దార్‌ ఇబ్బందికి గురిచేస్తున్నాడు.

ఈక్రమంలో బాధిత రైతు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులను అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ రాజేంద్రనా«థ్‌ను పట్టుకున్నారు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాపులకనిపర్తిలో చింతనెక్కొండకు చెందిన నల్లెపు కుమార్‌కు మూడెకరాల భూమి ఉంది. అందులో నుంచి తన చెల్లెలికి ఎకరం భూమిని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. కానీ తహసీల్దార్‌ రాజేంద్రనాథ్‌ రిజిస్ట్రేషన్‌ చేయకుండా.. నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.


హనుమకొండలోని రాజేంద్రనాథ్‌ నివాసం 

ఈక్రమంలో రైతు ఈనెల 2న తహసీల్దార్‌ అడిగిన రూ.50 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం తహసీల్దార్‌ రాజేంద్రనాథ్‌ రైతు కుమార్‌కు ఫోన్‌ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి రావాలన్నాడు. రైతు నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాజేంద్రనాథ్‌ నివాసంలో కంప్యూటర్, ఇతర ఫైల్స్‌ పరిశీలించారు. విలువైన భూముల పత్రాలు, వాహనాలు, ప్లాట్లు ఇతర విలువైన పత్రాలు లభించినట్లు సమాచారం.

అనంతరం సంగెం తహసీల్దార్‌ కార్యాలయానికి రాజేంద్రనాథ్‌ను తీసుకొచ్చి ఆర్డీఓ మహెందర్‌జీ సమక్షంలో రికార్డులు తనిఖీ చేసి, సోదాలు నిర్వహించారు. కాగా.. తహసీల్దార్‌ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను, రికార్డులను, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను, సీసీ పుటేజీలను సీజ్‌ చేసినట్లు సమాచారం. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్‌ తెలిపారు.

ఆది నుంచి అదేతీరు!
సంగెం తహసీల్దార్‌ రాజేంద్రనాథ్‌ ఉద్యోగ ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదమే! గతంలో డీటీ స్థాయిలో ఓప్రజాప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేశారు. అక్కడ్నుంచి బదిలీ అయిన తర్వాత సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జేసీల వద్ద సీసీగా పని చేశారు. తర్వాత ధర్మసాగర్‌లో పని చేశారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్‌ జిల్లాకు వెళ్లిన ఆయన మొదట్లో నల్లబెల్లి తహసీల్దార్‌గా వెళ్లారు. అక్కడ కూడా వివాదాస్పద పనులతో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

దీంతో ఉన్నతాధికారులు అతడిని కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. కలెక్టరేట్‌కు వచ్చిన తర్వాత ఆయన తీరు మరింత ఆందోళనకరంగా మారిందని ఆరోపణలున్నాయి. కలెక్టరేట్‌ ఏఓగా పని చేస్తూ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం చేయాల్సిన సమయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సదరు అధికారి ఇబ్బందులు భరించలేక జిల్లాలోని సçహోద్యోగులు, రెవెన్యూ శాఖలోని ఇతర స్థాయి ఉద్యోగులు ఇతడి వేధింపులపై ఓ జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరుగా తమ బాధలు చెప్పుకున్నట్లు సమాచారం.

పదే పదే ఆరోపణలు వస్తున్నా.. కొందరు అధికారులు సదరు తహసీల్దార్‌కు అన్ని విధాలా అండగా నిలవడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. అండగా నిలిచిన ఆజిల్లా ఉన్నతాధికారి బదిలీ కావడంతో కలెక్టరేట్‌ నుంచి రాజేంద్రనాథ్‌ బదిలీ అనివార్యమైంది. దీంతో తోటి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతుంటారు. తీవ్రస్థాయిలో ఆరోపణలున్న రాజేంద్రనాథ్‌ను 2019లో ఉత్తమ అధికారి అవార్డు అందించడం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top