Village Revenue Assistants VRA Protesting In Telangana - Sakshi
Sakshi News home page

42 రోజుల సమ్మె.. 20 మంది వీఆర్‌ఏల మృతి.. సీఎం సారూ జర చూడు!

Sep 5 2022 4:52 AM | Updated on Sep 5 2022 3:56 PM

Village Revenue Assistants VRA Protesting In Telangana - Sakshi

పెద్దపల్లిలో బతుకమ్మలతో వీఆర్‌ఏల నిరసన (ఫైల్‌) 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కొన్నిరోజులుగా విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)లు చేస్తున్న సమ్మె.. కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. 42 రోజుల సమ్మె కాలంలో దాదాపు 20 మంది వీఆర్‌ఏలు వివిధ కారణాలతో మరణించారు. వీరిలో పలువురు ఉద్యోగం క్రమబద్ధీకరణ కాదన్న మనస్తాపంతో గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారని, మిగిలిన వారు దురదృష్టవశాత్తూ అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో మరణించారని వీఆర్‌ఏలు చెబుతున్నారు.

డిమాండ్లు సాధనకోసం సమ్మెకు దిగిన వీఆర్‌ఏలకు తోటి ఉద్యోగుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా తాము వెనకడుగు వేసేది లేదని, డిమాండ్లు నెరవేర్చుకునేదాకా సమ్మె విరమించబోమని వీఆర్‌ఏల రాష్ట్ర సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,245 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరిలో 19,345 మంది నిజాం కాలంలో పనిచేసినవారినుంచి వా రసత్వంగా వచ్చిన ఉద్యోగాలు నిర్వహిస్తుండగా.. మిగిలిన 2,900 మంది ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్‌గా నియుక్తులయ్యా రు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించి, పేస్కేలు, ఆరోగ్య బీమా, పింఛన్, పదోన్నతులు.. తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. 

సమ్మె ఎందుకు? 
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది జూలై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తమకు పేస్కేలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే తమలో పీహెచ్‌డీలు, పీజీలు, ఎంటెక్, బీటెక్‌ వంటి ఉన్నత చదువులు ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

2016లో వీరికి పదోన్నతి కల్పించాల్సి ఉన్నా.. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా అది వాయిదాపడింది. అనంతరం 10 జిల్లాలు 33 అయ్యాయి. 42 రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కు చేరింది. మండలాలు 466 నుంచి 594 అయ్యాయి. ఈ పెంపునకు సరిపడా కొత్తగా వీఆర్‌ఏలను రిక్రూట్‌ చేయలేదు. పైగా ఇటీవల ధరణిని ప్రవేశపెట్టే సమయంలో దాదాపు 5,500 మంది వీఆర్వోలను తొలగించారు. దాంతో వారి పని కూడా వీరే చేయాల్సి వస్తోంది. దీంతో తమకు కనీస హక్కులు అమలు కావడం లేదన్న ఆందోళనలో ఉన్న వారంతా సమ్మెకు దిగారు. 

ఒక్కొక్క ప్రాణం గాలిలో.. 
సమ్మె మొదలైన తరువాత దాదాపు 20 మందికిపైగానే వీఆర్‌ఏలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మందికి మనస్తాపంవల్ల గుండెపోటు రావడంతోనే మృతి చెందారని అంటున్నారు. 2015 నుంచి చూసుకుంటే ఈ సంఖ్య 100 మంది వరకు ఉంటుందని సమాచారం. 

ప్రభుత్వమే బాధ్యత వహించాలి 
మా తండ్రి తాళ్లపెల్లి పెద్దన్న నెలరోజులుగా సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోయేసరికి.. పేస్కేల్‌ రాదనే మనోవేదనతో ప్రాణాలు విడిచారు. మా కుటుంబ పెద్దదిక్కును కోల్పోయాం. అనారోగ్యంతో ఉన్న మాతండ్రికి హెల్త్‌ కార్డులేక మెరుగైన వైద్యం అందించలేకపోయాం. నా తండ్రి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 
– తాళ్లపెల్లి భీమయ్య 
 
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి 
ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకుంటానని పలుమార్లు అసెంబ్లీలో చెప్పినా ఆ మాటలు నెరవేరలేదు. దీంతో ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో వీఆర్‌ఏలు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.  
– బాపుదేవ్, వీఆర్‌ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement