
వికారాబాద్: ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ (33)కు ఇదే మండలం కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది.
వీరికి ఈశ్వర్ ప్రసాద్ (10), సుకుమార్ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది.
ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, ఎస్‌ఐలు రాథోడ్ వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.