ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు

Vikarabad: Low Quality Food In Fast Food Centers Dhaba Hotels - Sakshi

సాక్షి, వికారాబాద్‌: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్‌ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్‌చార్జ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్‌ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు.   

అనుమతులు లేకుండానే  
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్‌ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.   

పాచిపోయిన బిర్యానీ  
వికారాబాద్‌లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్‌ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్‌లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు.

న్యూ గంజ్‌లోని మరో బిర్యానీ సెంటర్‌లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్‌ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్‌లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది.  

ఎప్పుడూ తాళమే..  
స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఫుడ్‌ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్, ఫుడ్‌ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్‌ అసిస్టెంట్, అటెండర్‌ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌కు వికారాబాద్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.

హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్‌లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top