అక్కడ చెట్టూ పుట్టా పీవీ జ్ఞాపకాలే!

Vignana Vedika Devoloped In Former PM PV Own Village Vangara   - Sakshi

మాజీ ప్రధాని సొంతూరు వంగరలో విజ్ఞాన వేదిక

పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.11 కోట్లతో నిర్మాణం

ఆయన ఆలోచనాశైలి, ప్రత్యేకతలు ప్రతిబింబించేలా డిజైన్‌

ఆయన వాడిన వస్తువులతో మ్యూజియంగా మారనున్న ఇల్లు

నెలరోజుల్లో పనులు మొదలు.. ఏడాదిలో పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: పీవీ నరసింహారావు.. బహుభాషా కోవిదుడు, మేధావి, రాజకీయ చతురుడు, దార్శనికుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో ఉన్న ప్రత్యేకతలెన్నో. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన జీవితం విద్యార్థుల మొదలు రాజకీయ నేతల వరకు ఓ పాఠం లాంటిది. పీవీ ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు తన సొంత గ్రామమైన వంగరలో ఓ విజ్ఞానవేదిక రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్మిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని మరో నెలరోజుల్లో పనులు మొదలుకానున్నాయి. 2022లో ఆయన జయంతి నాటికి వేదికను ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

నాలుగు ఎకరాల్లో నిర్మాణం..
వంగరలో పీవీ విజ్ఞాన వేదిక పేరుతో నాలుగు ఎకరాల్లో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. పీవీ నరసింహారావు రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవులు నిర్వహించి ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రధానిగా దేశముఖచిత్రంపై చెరగని ముద్ర వేశారు. ప్రతి శాఖలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయన చూపిన ప్రత్యేకతలు ప్రతిబింబించేలా ఇది రూపుదిద్దుకోనుంది. దాన్ని కళ్లకు కట్టేలా చిత్రాలు, శిల్పాలతో తీర్చిదిద్దనున్నారు. రైతులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా విధానం, భూసంస్కరణలు, పల్లె ప్రగతి.. ఇలా ప్రతి అంశానికి ఇందులో చోటుదక్కనుంది. పర్యాటకులు పీవీ గురించి తెలుసుకునేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇక పర్యాటకులకు ఫుడ్‌ కోర్టులు, ఉద్యానవనాలు లాంటివి ఇక్కడ సమకూరనున్నాయి. మధ్యలో పీవీ విగ్రహం కొలువుదీరనుంది. 

మ్యూజియంగా పీవీ ఇల్లు
వంగర గ్రామంలో పీవీ నరసింహారావు నివసించిన ఇంటిని మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన వాడిన వస్తువులు, ఆయన ఛాయాచిత్రాలు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది. 

పీవీ కుటుంబంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రతిబింబించేలా ఓ విజ్ఞాన వేదికను నిర్మించను న్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. పీవీ శత జయంతి వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావుతో కలసి శుక్రవారం ఆయన పీవీ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. వంగర గ్రామంలో విజ్ఞాన కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 7 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని వారికి అందించారు. వంగర గ్రామాభివృద్ధి, పీవీ నివాసాన్ని మ్యూజియంగా మార్చటం, విజ్ఞాన వేదిక థీమ్‌ పార్కు ఏర్పాటుపై వారికి వివరించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అధికారులతో కలసి వంగరలో పర్యటించి అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పీవీ కుటుంబంతో చర్చించానన్నారు.


సిద్దిపేట–వరంగల్‌ రహదారిపై ఆర్చి, విగ్రహం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top