
సిగాచీ పేలుడు దుర్ఘటనకు రేపటితో నెల రోజులు
బాధిత కుటుంబాలకు ఇప్పటికీ అందని పరిహారం
54 మంది మృతుల్లో 23 కుటుంబాలకే నామమాత్రంగా పరిహారం
మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ తీవ్ర జాప్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నెల క్రితం సిగాచీ పరిశ్రమ పేలుడు దుర్ఘటనలో మరణించిన కారి్మకుల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కుటుంబాన్ని పోషించేవారిని కోల్పోయిన ఈ బాధితులకు ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా పరిహారం అందలేదు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జూన్ 30న జరిగిన ఘోర ప్రమాదంలో 54 మంది మరణించారు. ఇందులో ఎనిమిది మంది మృతదేహాలు కూడా లభించలేదు. పేలుడు ధాటికి వారి శవాలు కాలిబూడిదైపోయి ఉంటాయని అధికారులు నిర్ధారించి, వారిని కూడా మృతుల జాబితాలో చేర్చారు. 46 మంది మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని నాడు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల్లో ఈ మొత్తాన్ని అందజేస్తామని సిగాచీ పరిశ్రమ యాజమాన్యం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
నామమాత్రం పరిహారంతో సరి..
ఆచూకీ లభించని 8 మంది కుటుంబాలకు ఈ నెల 9న రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మరణించిన 46 మందిలో 15 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలినవారికి ఇంతవరకు పరిహారం అందించలేదు. ప్రమాదం జరిగి రేపటికి నెల అవుతుంది. ఇప్పటికీ మృతులకు పూర్తి స్థాయిలో మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేదు. మృతదేహాలు లభించిన 46 మందిలో 38 మందికే డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆచూకీ లభించకుండా పోయిన వారికి డెత్ సరి్టఫికేట్ జారీ చేయడంలో నిబంధనలు అడ్డు వస్తున్నాయి. మరోవైపు కొందరు బాధితులకు పోలీసు పంచనామా కాపీలు కూడా రాకపోవడంతో ఇన్సూరెన్స్ వంటివి క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
రెండు నెలలకే జీవితం తలకిందులు..
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాకు చెందిన ఈ మహిళ పేరు సంజూదేవి. ఈమె భర్త చోటేలాల్ సిగాచీ దుర్ఘటనలో మరణించాడు. రెండు నెలల క్రితమే పెళ్లి అయిన సంజూదేవి భర్తను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నెల రోజులైనా తనకు ఎక్స్‌గ్రేషియా డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కొడుకు లేడు.. పరిహారం లేదు
ఈ వ్యక్తి పేరు రాందాస్. ఆయన కుమారుడు జస్టిన్ సిగాచీ పేలుడు ఘటనలో కనిపించకుండా పోయా డు. జస్టిన్‌కు ఒక చెల్లి, ఒక అక్క ఉన్నారు. జస్టిన్ పనిచేస్తేనే ఈ కుటుంబానికి ఇల్లు గడిచేది. ఇప్పుడు జస్టిన్ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి తమను ఆదుకోవాలని రాందాస్ కన్నీరు మున్నీరవుతున్నాడు.
ఉద్యోగమైనా ఇప్పించండి..
నా భార్య రుక్సానాఖతుం సిగాచీ పేలుడులో మృతి చెందింది. ఆర్థిక సహాయం రూ.పది లక్షల చెక్కును అందించారు. మిగతాది ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. వెంటనే పరిహారం చెల్లించాలి. ఉద్యోగ అవకాశమైనా కలి్పంచాలి.
– మెనుద్దీన్‌ఖాన్, బిహార్
రెండురోజుల్లో మళ్లీ పరిహారం పంపిణీ చేస్తాం..
15 కుటుంబాలకు ఇప్పటికే రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేశాం. మిగిలిన వారికి కూడా రెండు రోజుల్లో ఇస్తాం. ఈ వారంలోగా ఒక్కొక్కరికి మొత్తం రూ.25 లక్షల వరకు అందేలా చూస్తాం. 46 మందిలో 38 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చాం. ఎనిమిది మందికి పెండింగ్‌లో ఉన్నాయి.
– బి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, సంగారెడ్డి.