సాక్షి, యాదాద్రి: సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ (మం) పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి సంక్రాంతికి నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లినట్టు టోల్ సిబ్బంది చెబుతున్నారు.

మరోవైపు.. కొందరు పోకిరీలు టోల్ ప్లాజాల వద్ద విచ్చలవిడిగా అత్యవరస సైరన్స్(పోలీస్, అంబులెన్స్) దుర్వినియోగం చేస్తున్నారు. సైరన్‌తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు కొందరు పోకిరీలు ఇలా సైరన్ మోగిస్తూ హంగామా చేస్తున్నట్టు టోల్ సిబ్బంది గుర్తించారు. వీఐపీల్లా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టోకరా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరన్ చప్పుడుతో మిగతా వాహనదారులను హడలెత్తిస్తున్నారు.

మూడు రోజులుగా సైరన్లతో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లినట్టు సిబ్బంది చెబుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే బామ్మర్దిని, మంత్రి గారి బంధువును అంటూ ఫేక్ వీఐపీలు టోల్ సిబ్బందిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో, పోకిరీల సైరన్స్ పోలీసులకు సవాల్‌గా మారాయి.



