
భార్య శరీర భాగాలను నరికిన భర్త
విచారణలో పోలీసులకు వెల్లడించిన నిందితుడు
స్వాతి హత్య కేసులో మహేందర్ రెడ్డిని
కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్
శరీర భాగాల కోసం మూసీలో గాలింపు
సాక్షి, హైదరాబాద్: కోడిని కోసినంత సులువుగా.. పదే పది నిమిషాల్లో భార్య మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికానని విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. కాళ్లు, చేతులు, తల, మొండం వేర్వేరుగా చేసి.. మొండం మినహా మిగిలిన శరీర భాగాలను పర్వతాపూర్ వంతెన పైనుంచి మూసీలో పడేసినట్లు వివరించాడు. మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్‌రెడ్డి హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ హతురాలి శరీర భాగాలు లభించలేదు.
మూసీలోకి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంలో శరీర భాగాలు వరదలో కొట్టుకుపోవచ్చని, మూసీ వంతెన నుంచి 10 కి.మీ. దిగువన పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే బాలాజీనగర్‌లోని నిందితుడి ఇంటి నుంచి శరీర భాగాలను పారేసిన ప్రతాప సింగారం మూసీ వంతెన వరకూ ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు సేకరించారు. అలాగే హతురాలి మొండం నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. కోర్టు అనుమతితో హతురాలిని, ఆమె తల్లిదండ్రుల డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించారు. నిందితుడు మహేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి..
నిందితుడు మహేందర్ రెడ్డి గతంలో స్వాతిని పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, భర్తతో ఎదుర్కొన్న వేధింపులు తనతో చెప్పుకొని ఏడ్చిందని స్వాతి చెల్లెలు శ్వేత కన్నీరుమున్నీరైంది. స్వాతిని శారీరకంగా, మానసికంగా హింసించేవాడని ఆరోపించింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ సమీపంలోని ఒక వరద కాల్వ వద్దకు తీసుకెళ్లి అందులో దూకాలని ఒత్తిడి చేశాడని, చిన్న విషయానికే ఉద్దేశపూర్వకంగానే తగాదా పెట్టుకునేవాడని, ఈ క్రమంలో ఒకరోజు తాడు ఇచ్చి ఉరేసుకోవాలని ఒత్తిడి చేశాడని
ఆమె వాపోయింది.