గచ్చిబౌలిలో విషాదం: సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక..

Two Workers Deceased Cleaning Septic Tank In Hyderabad - Sakshi

ఇద్దరిని కబళించిన సెప్టిక్‌ ట్యాంక్‌

శుభ్రపరిచే క్రమంలో ఆగిన ఊపిరి

మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర అస్వస్థత

భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే కారణం

కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో దుర్ఘటన

మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

సింగరేణి కాలనీలో విషాద ఛాయలు

సాక్షి, హైదరాబాద్‌: సెప్టిక్‌ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన కొండాపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్‌ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం జరిగింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ జి.సురేష్, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్‌ అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్‌ట్యాంక్‌ శుభ్రం చేయడానికి ప్రైవేటు సెప్టిక్‌ ట్యాంకర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంకర్‌ డ్రైవర్, యజమాని అయిన స్వామి, హెల్పర్‌ జాన్‌ కలిసి క్లీనింగ్‌ చేయడానికి ఒప్పుకొన్నారు.

చంపాపేట్‌ సింగరేణి కాలనీ ఆదర్శనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ (38) అలియాస్‌ శ్రీను, ఈ ప్రాంతానికే చెందిన ఆంజనేయులు (25)ను సెíప్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేసే పనులకు రావాలని చెప్పారు. వీరిద్దరూ సరే అనడంతో ఆదివారం ఉదయం 8 గంటలకు గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్‌ అపార్ట్‌మెంట్‌కు ట్యాంకర్‌తో పాటు చేరుకున్నారు. సెప్టిక్‌ ట్యాంక్‌ మూతలు తీసి పైపులతో కొంత నీటిని తొలగించారు.

 

భద్రత చర్యలు నిల్‌.. 
సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేయాలంటే ముందుగా భద్రత చర్యలు చేపట్టాలి. కానీ.. హేమదుర్గా అపార్ట్‌మెంట్‌లో లోపలికి దిగిన ఆంజనేయులు, శ్రీనివా స్‌ ముఖానికి మాస్కులతో కూడిన యంత్రాలు వాడకపోవడం, అంతకుముందే ఎగ్జాస్టింగ్‌ ఫ్యాన్‌ను వాడకపోవడం, మూత తెరిచి కనీసం అందులోని విషవాయువులు బయటకు వెళ్లి పోయేంత వరకు వేచి ఉండక పోవడంతోనే ఇద్దరు మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. సెప్టిక్‌ ట్యాంకర్‌ జీహెచ్‌ఎంసీలో రిజిస్టర్‌ చేసుకున్నా వారి ద్వారా వచ్చిన కాల్‌ కాకుండా ప్రైవేటుగా వచ్చిన కాల్‌తోనే వారు వచ్చి శుభ్రం చేసే పనులను చేపట్టినట్లు తెలుస్తోంది. 

మిన్నంటిన రోదనలు..  
మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాస్, ఆంజనేయులు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. శ్రీనివాస్‌ స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మంజు తండా. కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఆటో నడపడంతో పాటు ఇతర కూలిపనులు చేస్తున్నాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆంజనేయులుది నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట్‌లోని అక్కారం గ్రామం. భార్య పద్మ, అయిదేళ్ల కుమారుడు ఉన్నారు. సెప్టిక్‌ ట్యాంక్‌ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు.  

ఊపిరి ఆడకపోవడంతోనే..  
శుభ్రపరిచేందుకు శ్రీనివాస్, ఆంజనేయులు సెప్టిక్‌ ట్యాంక్‌ లోపలికి దిగారు. అరగంట అయినా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడంతో స్వామి, జాన్‌ కూడా లోపలికి దిగారు. ఇది గమనించిన వాచ్‌మన్‌ మరికొందరితో కలిసి స్వామిని, జాన్‌ను బయటికి లాగారు. వారు ఊపిరి తీయడం తీవ్ర ఇబ్బందిగా ఉండటంతో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సెప్టిక్‌ట్యాంక్‌ లోపలే ఊపిరి ఆడక బయటకు రాలేకపోయిన శ్రీనివాస్, ఆంజనేయులును అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెలికితీశారు. అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడినట్లు గుర్తించారు. 

చదవండి: ఎన్టీఆర్‌ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top