ప్రియుడితో కలిసి తల్లి, సోదరి హత్య | Woman Ends Her Mother And Sister Lives In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి తల్లి, సోదరి హత్య

Mar 8 2025 7:24 AM | Updated on Mar 8 2025 9:45 AM

Two Dies In Hyderabad

అడ్డగుట్ట/జవహర్‌నగర్‌: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తల్లిని, సోదరిని దారుణంగా హత్య చేసింది. ఆ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న జవహర్‌నగర్‌ పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న క్రమంలో తన అక్కను సైతం హత్య చేసినట్లు ఆమె అంగీకరించడంతో లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌ నుంచి ఆ మృతదేహాన్నీ రికవరీ చేశారు.

 పరారీలో ఉన్న ప్రియుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడు చిక్కితేనే ఈ హత్యలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. నార్త్‌ లాలాగూడ ప్రాంతానికి చెందిన వడుగుల నాగయ్య, సుశీల (60)కు జ్ఞానేశ్వరి (45), లక్ష్మి (40), ఉమామహేశ్వరితో పాటు శివకైలాష్‌ సంతానం. ముగ్గురు కుమార్తెలూ అవివాహితులే. వివాహితుడైన శివ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. అతడి భార్య స్రవంతి అత్తింట్లోనే ఉంటున్నారు. 

వివాహేతర సంబంధంపై నిత్యం గొడవలు.. 
సుశీల పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక సమస్యలు ఉన్నాయి. చిన్న కుమార్తె ఉమామహేశ్వరి లాల్‌ బజార్‌లోని ఓ కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్నారు. రైల్వేలో పని చేసిన సుశీల భర్త నాగయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగం వారి రెండో కుమార్తె లక్ష్మికి వచ్చింది. 2018 నుంచి ఈ కుటుంబం లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోనే ఉంది. ఆ తర్వాత జవహర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌ భరత్‌నగర్‌లో ఇల్లు కట్టుకోవడంతో సుశీల, ఉమామహేశ్వరి, స్రవంతి అక్కడికి మారారు. 

లక్ష్మి లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్‌లో ఉద్యోగం చేస్తుండడంతో ఆమెతో పాటు అక్క జ్ఞానేశ్వరితో కలిసి ఉంటోంది. సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన తాపీమేస్తీ బిల్డర్‌ అరవింద్‌ కుమార్‌తో (45) ఈ కుటుంబానికి 2010 నుంచి పరిచయం ఉంది. భరత్‌నగర్‌లో ఇల్లు కూడా అతడే కట్టడంతో లక్ష్మితో పరిచయం మరింత పెరిగింది. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నిత్యం వీరిద్దరూ కలుస్తుండటంతో విషయం లక్ష్మి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీని పై పలుమార్లు ఇంట్లో గొడవలు కూడా జరిగాయి.  

సుశీల మెడకు చీరతో ఉరి బిగించి.. 
గురువారం ఉదయం 9.30 గంటలకు ఉమా మహేశ్వరి, స్రవంతి తన ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోగా సుశీల ఒక్కరే ఇంట్లో ఉన్నారు. రాత్రి 7.17 గంటలకు ఆ ఇంట్లో నుంచి శబ్ధాలు వస్తుండటం గమనించిన పక్కింట్లో ఉండే వెంకటేష్‌ విషయాన్ని ఫోన్‌ ద్వారా ఉమా మహేశ్వరికి తెలిపారు. ఆమె తన తల్లి సుశీలకు ఫోన్‌ చేయగా స్పందన లేదు. దీంతో మళ్లీ వెంకటేష్ కు ఫోన్‌ చేసిన ఆమె ఇంట్లోకి వెళ్లి చూడాల్సిందిగా కోరారు. ఆయన సమీపంలో ఉండే సారంగపాణితో కలిసి సుశీల ఇంటి వద్దకు వెళ్లారు. బెడ్రూంలో విగతజీవిగా పడి ఉన్న సుశీలను చూసి ఉమామహేశ్వరికి సమాచారం ఇచ్చారు. 

అదే సమయంలో అరవింద్‌ ఆమె ఇంటి మొదటి అంతస్తు నుంచి పక్కింటి పైకి దూకి పారిపోవడాన్నీ గమనించారు. 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన ఉమామహేశ్వరి తన తల్లి నోట్లో వ్రస్తాలు కుక్కి, చీరతో మెడకు ఉరి బిగించి చంపినట్లు గుర్తించింది. అరవింద్‌ కుమార్‌ తన తల్లిని చంపాడని, ఆమె ఒంటిపై ఉన్న మూడున్నర తులాల బంగారం దోచుకుపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరచూ తమ ఇంటికి వచ్చే అరవింద్‌ బుధవారం సాయంత్రం కూడా వచి్చవెళ్లినట్లు పేర్కొంది.  

అక్క జ్ఞానేశ్వరిని కూడా హతమార్చినట్లు.. 
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుశీల మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు లక్ష్మి, అరవింద్‌ మధ్య ఉన్న వివాహేతర సంబం«ధాన్ని గుర్తించారు. సుశీల హత్యలో లక్ష్మి పాత్ర ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను అరవింద్‌తో కలిసి అక్క జ్ఞానేశ్వరి చంపామని ఆమె బయటపెట్టింది. బుధవారమే ఆమెను చంపి, మృతదేహాన్ని మూటకట్టి సమీపంలో రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న పాడుబడిన బావిలో పడేసినట్లు అంగీకరించింది. దీంతో లక్ష్మిని తీసుకుని లాలాగూడ వచ్చిన జవహర్‌నగర్‌ పోలీసుల జ్ఞానేశ్వరి మృతదేహాన్నీ రికవరీ చేశారు. కుళ్లిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాన్ని సైతం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు హత్యలు ఒకేసారి, ఒకే ప్రాంతంలో చేశారా? లేక వేర్వేరుగా చేశారా? అనే దానిపై లక్ష్మి నోరు విప్పట్లేదు. పరారీలో ఉన్న అరవింద్‌ కోసం గాలిస్తున్న అధికారులు అతడు చిక్కితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement