సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం | Sakshi
Sakshi News home page

బషీర్‌బాగ్‌ కాల్పులకు 20 ఏళ్లు

Published Fri, Aug 28 2020 5:20 AM

Twenty Years For Basheer Bagh Shooting Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్‌ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. ప్రపంచబ్యాంక్‌ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్‌ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్‌ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి.

దాదాపు నాలుగు నెలలపాటు సాగిన నిరసనల సందర్భంగా 25 వేలకు పైబడి కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అప్పటి సీఎల్పీ నేత రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనూ విద్యుత్‌ చార్జీల ఉద్యమం ఉధృతమైంది. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 90 మంది ఎమ్మెల్యేలతో విపక్షనేత డాక్టర్‌ వైఎస్సార్‌ నిరవధిక నిరాహారదీక్షను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్‌ తగిలేలా చేశారు. విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకు నేటి తెలంగాణ సీఎం, నాటి డిప్యూటీ స్పీకర్‌ కె.చంద్రశేఖరరావు లేఖ ద్వారా తమ అసంతృప్తిని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పదవికి, టీడీపీకి కేసీఆర్‌ రాజీనామా చేసి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటునకు విద్యుత్‌చార్జీల ఉద్యమం, కాల్పుల ఘటన పరోక్షంగా కారణమైంది.

ఆ రోజు ఏమైందంటే...
విద్యుత్‌ చార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ విడివిడిగా ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించినా వేలాదిమంది కార్యకర్తలు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్‌బాగ్‌ వైపు సాగారు. బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని ఫ్లైఓవర్‌ కింద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. అశ్వికదళాలు సైతం కదంతొక్కాయి. అక్కడకు కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు ప్రయోగించి, గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ వైపునకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు పోలీసు కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకీ గుళ్లు తగిలి అసువులు బాశారు. ఆ విధంగా బషీర్‌బాగ్‌ ప్రాంతం రక్తసిక్తమైంది. 

చంద్రబాబు పాలనకు కౌంట్‌డౌన్‌..
చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ పాలనకు కాల్పుల ఘటనతో కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకచర్యలు, తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ డా.వైఎస్సార్‌ చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేసిం ది. 2004లో టీడీపీ పాలనను అంతమొందిస్తూ డా.వైఎస్సార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ కింద ముగ్గురు నేలకొరిగిన ప్రాంతం లో విద్యుత్‌ అమరవీరుల జ్ఞాపకార్థం ‘షహీద్‌చౌక్‌’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 28న నాటి క్రూరమైన కాల్పుల ఘటనను గుర్తుచేసుకుంటూ వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆ ముగ్గురు యోధులకు నివాళి, జోహార్లు అర్పించి వారిని గుర్తుచేసుకుంటున్నారు.   

Advertisement
Advertisement