బ్రాండ్ అంబాసిడర్‌‌గా దేత్తడి హారిక: క్లారిటీ ఇచ్చిన గుప్తా!

TSTDC Chairman Gives Clarity Dethadi harika Brand Ambassador Issue - Sakshi

తెలంగాణ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా బిగ్‌బాస్‌ ఫేం, యూట్యూబర్‌ దేత్తడి హారికను నియమించడంపై పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఏం అర్హత ఉందని బ్రాండ్ అంబాసిడర్‌ను చేశారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్, కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహించి తెలంగాణ ఘనతని విశ్వవ్యాప్తం చేసిన మలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికైన వారణాసి మానస పేర్లు కనిపించడం లేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌ తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం  అందజేశారు. అయితే దేత్తడి హారికను టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం టూరిజం మంత్రికి కూడా తెలీయదని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీ‌నివాస్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌ బాస్ ఫేమ్‌, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారికే ఉంటార‌ని ఆయన స్పష్టం చేశారు. హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ కార్యాల‌యంలో మేనేజింగ్ డైరెక్టర్ మ‌నోహ‌ర్ రావుతో క‌లిసి ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారికను తొల‌గించార‌ని వ‌స్తున్న వార్తలను ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారిక కొన‌సాగుతారని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..

కోట్లు వెచ్చించి హారికను తీసుకోలేదు
‘తెలంగాణ ఆడబిడ్డ, కరీంనగర్‌ వాస్తవ్యురాలైన దేత్తడి హారికకు ప్రమోషన్‌ ఇచ్చేవిధంగా టీఎస్‌టీడీసీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించాం. మార్కెటింగ్‌లో ప్రమోషన్స్‌ కోసం హోటల్స్‌, బోటింగ్‌, బస్సులు నడవడానికి హారికను నియమించాం. కానీ ఎక్కడో మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల ఆమెను తొలగించారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి న‌మ్మొద్ద‌ు. దీని గురించే ఎండీ గారు, మేమంతా కూర్చొని చర్చించాం. టూరిజాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌చారం చేస్తున్నాం. అందుకే హారికను తీసుకున్నాం. అంతేగాని ఆమెను కోట్లు పెట్టి మేము తీసుకోలేదు. కోవిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కాబట్టి హారికను పెడితే కొద్దీగా ప్రమోషన్‌ వస్తుందని మా ఆలోచన. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ నాయకత్వంలో తెలంగాణ టూరిజాన్ని నెంబర్‌ వన్‌గా డెవలప్‌ చేసేందుకు కృషిచేస్తున్నాం.’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. 

.చదవండి: స్టార్‌ హీరోయినే నా డ్రీమ్‌: దేత్తడి హారిక

బిగ్‌బాస్‌ హారికకు భారీ షాక్‌..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top