తెలంగాణ ఆర్టీసీ ఆశలు ఆవిరి.. పెంచుకుందామంటే పడిపోయింది | Tsrtc Continues To Grapple With Losses | Sakshi
Sakshi News home page

రూ.14 కోట్ల నుంచి రూ.11.50 కోట్లకు పడిపోయిన.. ఆర్టీసీ ఆదాయం

Apr 17 2023 3:47 AM | Updated on Apr 17 2023 2:53 PM

Tsrtc Continues To Grapple With Losses - Sakshi

ఆక్యుపెన్సీ రేటును భారీగా పెంచుకుని పెద్ద మొత్తంలో అదనపు ఆదాయం ఆర్జించాలన్న ఆర్టీసీ యత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది. అదనపు ఆదాయం దేవుడెరుగు సగటున రోజుకు రావాల్సిన ఆదాయానికే గండి పడుతోంది. గతేడాది ఆర్టీసీ  నిర్వహించిన 100 రోజుల ప్రణాళిక సూపర్‌ సక్సెస్‌ కావడంతో రూ.178 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి అదనపు బస్సులతో అదే తరహాలో రూ. 200 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా 100 రోజుల ప్రణాళిక ప్రారంభించినా.. ఈసారి మాత్రం సగటున రోజుకి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. గతేడాది ఇదే ఎండా కాలంలో చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాన్నిస్తే, ఈసారి అదే వేసవి చుక్కలు చూపిస్తోంది. 

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. గత నెల సగటున రోజుకి రూ.14  కోట్లకుపైగా ఆదాయం నమోదవుతూ రాగా, ఏప్రిల్‌ ఒకటి నుంచి అది రూ.11.5 కోట్లకు పడిపోయింది. మార్చి చివరి వరకు ఆక్యుపెన్సీ రేషియో సగటున 68 శాతం వరకు ఉంటే అది ఇప్పుడు 58 శాతం వద్ద దోబూచులాడుతోంది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిలో పడుతున్న తరుణంలో, ఈ వేసవిలో వంద రోజుల ప్రణాళిక పేరుతో.. స్పేర్‌లో ఉన్నవి సహా అన్ని బస్సులనూ రోడ్డెక్కించి అదనపు కిలోమీటర్లు తిప్పటం ద్వారా మరింత ఆదాయం పొందేందుకు చేసిన ప్రయత్నం ఈ నెలలో విఫలమైందనే చెప్పాలి. కనీసం రోజువారీ రూ.16 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.12 కోట్లు పొందటం కూడా గగనమైంది. దీంతో ఈ నెలలో నష్టాలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

లాభాల నుంచి నష్టాల బాటలోకి 
ఇటీవలి కాలంలో వంద రోజుల ప్రణాళిక, ప్రాఫిట్‌ ఛాలెంజ్‌ లాంటి కార్యక్రమాలతో చాలా డిపోలు లాభాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 35 డిపోలు లాభాలు తెస్తుండగా, మరో 20 డిపోలు అతి తక్కువ నష్టాల జాబితాలో ఉన్నాయి. అలాంటిది ప్రస్తుతం రోజుకు రెండుమూడు డిపోలు మాత్రమే లాభాల్లో ఉంటున్నాయి. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీని పరిశీలిస్తే.. 94 డిపోలు నష్టాలను చవిచూశాయి. హైదరాబాద్‌–1 డిపో రూ.2.27 లక్షలు, పికెట్‌ డిపో 80 వేల లాభాన్ని తెచ్చి పెట్టగా నార్కెట్‌పల్లి డిపో నోప్రాఫిట్‌/నో లాస్‌గా నిలిచింది(ఏప్రిల్‌ నెలకు సంబంధించి మిగతా రోజుల్లో నష్టాల్లో ఉంది). మిగతా డిపోలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి.  గతేడాది చివరలో డీజిల్‌ సెస్‌ను ఆర్టీసీ భారీగా పెంచటం ద్వారా టికెట్‌ చార్జీలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో భారీ ఆదాయం నమోదవుతోంది. గతేడాది వేసవిలో ఆ చార్జీలు తక్కువే ఉన్నాయి. అయినా గత ఏప్రిల్‌లో ప్రస్తుతం నమోదవుతున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం రావటం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో అప్పుడే మెరుగ్గా నమోదైంది.  

శూన్య మాసం వల్లనేనా 
ప్రస్తుతం శుభముహూర్తాలు లేని శూన్యమాసం నడుస్తోంది. దీంతో శుభకార్యాలు లేక ప్రయాణాలు కూడా బాగా తగ్గాయి. సాధారణంగా ఎండ తీవ్రత పెరిగాక ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గుతుంది. కానీ శుభకార్యాలుంటే బస్సులు కిక్కిరిసి ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా నమోదవుతుంది. గతేడాది ఏప్రిల్‌లో ఎండలు ఎక్కువే ఉన్నా,  శుభకార్యాల వల్ల ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా నమోదైంది. ఈ నెలాఖరు వరకు శూన్యమాసమే ఉండనున్నందున ఈ నెల అంతా ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. 

పరీక్షలు కూడా కారణమే 
విద్యార్థులకు ఇంకా వేసవి సెలవులు ప్రారంభం కాలేదు. పరీక్షలు కొనసాగుతున్నందున ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా తక్కువగా నమోదవుతోంది. ఈనెలాఖరుకుగాని వేసవి సెలవులు ప్రారంభమయ్యే వీలులేనందున అప్పటి వరకు ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలు తక్కువగా ప్రయాణిస్తారు. ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఆర్టీసీపై పడింది. 

అన్ని బస్సులూ తిప్పడంతో డీజిల్‌ భారం 
వంద రోజుల ప్రణాళిక పేరుతో ప్రస్తుతం అన్ని బస్సులనూ తిప్పుతున్నందున డీజిల్‌ వినియోగం భారీగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్నందున, ఆదాయం కంటే డీజిల్‌ ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితులుండటంతో బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో సర్వీసుకు–సర్వీసుకు మధ్య విరామం పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement