ముగిసిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్ష | TSPSC Group-1 Prelims Written Exam 2024 June 09 Details | Sakshi
Sakshi News home page

ముగిసిన తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్ష

Jun 9 2024 8:26 AM | Updated on Jun 9 2024 1:54 PM

TSPSC Group-1 Prelims Written Exam 2024 June 09 Details

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం  31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 1గం. దాకా పరీక్ష జరిగింది. ఒక్క నిమిషం నిబంధనతో చాలామంది పరీక్ష రాలేకపోయారు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఆ అభ్యర్థుల్ని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. 

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్‌–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు రద్దు అయిన ఈ పరీక్షను ఎట్టకేలకు ఇవాళ నిర్వహించారు. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎంతమంది హాజరయ్యానే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళన
జగిత్యాల పట్టణంలో గ్రూప్-1 పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరగంట టైం ఉన్నా కూడా 5 నిమిషాలు మాత్రమే ఉందని ఇన్విజిలేటర్ చెప్పారని, టైం అయిపోయిందని చెప్పడంతో తొందరలో ఆన్సర్ చేశామని ఆవేదన చెందారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్‌ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. 

రెండుసార్లు రద్దు.. 
కమిషన్‌ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్‌ నిర్వహించి మెయిన్‌ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్‌ 11న రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement