
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపైనా ఉన్నత విద్యా మండలి సమాలోచనలు చేస్తోంది. ఇంటర్ బోర్డు విద్యా బోధన చేపట్టే సిలబస్ ప్రకారమే ఎంసెట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. 12వ తరగతిలో సీబీఎసీఈ సిలబస్‌ను 30 శాతం తగ్గించినా, జేఈఈ మెయిన్ వంటి పరీక్షల్లో పూర్తి సిలబస్‌తో జేఈఈ మెయిన్ నిర్వహిస్తామని, విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రశ్నల సంఖ్యను పెంచి ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపడతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంటర్ బోర్డు 30 శాతం సిలబస్‌ను తొలగించి 70 శాతం సిలబస్‌పై వార్షిక పరీక్షలు నిర్వహిస్తే, ఆ సిలబస్‌పైనే ఎంసెట్ నిర్వ హించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినా ఇంటర్ బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ప్రిపరేషన్‌కు తక్కువ సమయమే..: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 3 నుంచి నిర్వహించేలా ఇంటర్ బోర్డు అకడమిక్ కేలండర్ రూపొందిస్తోంది. మే 19 వరకు ప్రధాన పరీక్షలు, 24 వరకు అన్ని పరీక్షల పూర్తికి షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఎంసెట్‌ను జూన్ 20 తర్వాత నిర్వహించే అవకాశముంది. ఎంసెట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇంటర్ పరీక్షల తర్వాత నెల సమయమే ఉండే పరిస్థితి నెలకొంది.
వచ్చే నెలలో షెడ్యూలు ప్రకటన
ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం అయ్యాక ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణ తేదీలను అధికారికంగా ఖరారు చేయనుంది. సెట్స్ కననర్ల నియామకాలను కూడా వచ్చే నెలలో చేపట్టే అవకాశముంది.