ఒకేసారి వైద్య కాలేజీల అనుమతికి యత్నం  | TS Government Starts 7 Medical And 13 Nursing Colleges Soon | Sakshi
Sakshi News home page

ఒకేసారి వైద్య కాలేజీల అనుమతికి యత్నం 

Jun 29 2021 8:37 AM | Updated on Jun 29 2021 8:37 AM

TS Government Starts 7 Medical And 13 Nursing Colleges Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్, 13 నర్సింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వైద్య రంగం మరింత బలోపేతం కానుంది. అనుమతులు వస్తే వచ్చే ఏడాది నుంచే ఆయా కాలేజీలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అవసరమైన అనుమతులు పొందేందుకు కేంద్రానికి దరఖాస్తు చేసేందుకు కసరత్తు మొదలైందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కేంద్రం నుంచి ఒకేసారి అనుమతులు సాధించేందుకు అవసరమైతే ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని యోచిస్తున్నారు. కాలేజీలకు అనుమతి వచ్చాక సిబ్బంది నియామకాలు చేపట్టనున్నారు.  

1,050 ఎంబీబీఎస్‌.. 1,300 నర్సింగ్‌ సీట్లు 
రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తంగా 1,600 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అలాగే 8 ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలుండగా, వాటిల్లో 320 సీట్లున్నాయి. కొత్తగా ఏడు మెడికల్‌ కాలేజీలతో 1,050 ఎంబీబీఎస్‌ సీట్లు, 13 నర్సింగ్‌ కాలేజీలతో 1,300 నర్సింగ్‌ సీట్లు రానున్నాయి. దీంతో ప్రభుత్వంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2,650కు చేరుకుంటాయి. నర్సింగ్‌లో సర్కారుసీట్లు 1,620కు చేరుకుంటాయి. ప్రైవేట్‌లో ఇప్పటికే భారీగా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలో మరిన్ని సీట్లు పెరగడం వల్ల ఆయా కోర్సులు చదివే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. 

బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ సేవలు.. 
మెడికల్, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల వాటి అనుబంధ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కొత్త కాలేజీలతో ఆయా ప్రాంత ప్రజలకు బోధనాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. మున్ముందు పీజీ సీట్లు లభిస్తే స్పెషాలిటీ వైద్య సేవలు గ్రామీణ పేదలకు లభిస్తాయి. నర్సింగ్‌ కాలేజీలు ఏర్పడితే ఆస్పత్రుల్లో నాణ్యమైన నర్సింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement