14న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ 

TS EAMCET 2022 Notification For Admission Likely To Be Held In March 14 - Sakshi

జూన్‌ చివరి వారంలో పరీక్ష 

సాంకేతిక పరిశీలనలో టీసీఎస్‌ 

రెండు రోజుల్లో కన్సల్టెన్సీ నివేదిక 

ప్రభుత్వ అనుమతికి సిఫారసు 

తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. దీనిపై సమీక్ష సమావేశం సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో నోటిఫికేషన్‌ వెలువరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు అంగీకారం కుదిరిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు.

అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్‌ సంస్థకు వివరించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్దిష్ట మైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్‌ లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్‌ పరిశీలించి.. ఇబ్బంది లేకుండా చూసేందుకే కసరత్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఎన్ని పరీక్ష కేంద్రాలుండాలి? ఎక్కడ ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది? అనే అంశాలను టీసీఎస్‌ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్‌ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు.  

జూన్‌ చివరి వారం.. 
మే నెలలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తవుతాయి. ఇదే నెలలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు విద్యార్థులు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్‌ చివరి వారం ఎంసెట్‌ నిర్వహణకు అనుకూలమైనదిగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు.

ఇదే విషయాన్ని టీసీఎస్‌కు వివరించినట్లు వారు తెలిపారు. దీంతో పాటే పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోగా ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడికీ కసరత్తు చేయాలని తీర్మానించారు. వాస్తవానికి గతంలో ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండేది. కానీ, ఈసారి దానికి అవకాశం లేదని ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫస్టియర్‌ పరీక్షల్లో కనీస మార్కులతో ప్రమోట్‌ చేశారు.

కాబట్టి ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు, ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడికి సంబంధం ఉండదు. అందుకే త్వరగా ఫలితాలు వెల్లడించే వీలుంది. అలాగే కౌన్సెలింగ్‌ తేదీలపై మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌ ఫలితాలు, ఐఐటీ, నీట్‌ ప్రవేశాల తేదీలను బట్టి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను ఖరారు చేయాలనే యోచనలో అధికారులున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top