డీఎడ్‌ అర్హులకే ఎస్‌జీటీ పోస్టులు | ts dsc 2024 online application process started | Sakshi
Sakshi News home page

డీఎడ్‌ అర్హులకే ఎస్‌జీటీ పోస్టులు

Published Tue, Mar 5 2024 2:52 AM | Last Updated on Tue, Mar 5 2024 2:52 AM

ts dsc 2024 online application process started - Sakshi

రిజర్వేషన్‌ కేటగిరీలకు ఇంటర్‌ మార్కుల్లో సడలింపు 

పరీక్ష మొత్తం ఆన్‌లైన్‌ విధానంలోనే 

గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లు 

సమాచార బులెటిన్‌ విడుదల చేసిన విద్యాశాఖ 

మొదలైన దరఖాస్తుల ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: మెగా డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్‌ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పేపర్‌–2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంతో ఉన్న వాళ్లంతా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ విధి విధానాలను రూపొందించింది.

ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్‌ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్‌ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్‌ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్‌ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 

11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ 
మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుందని, 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్లు రూ.వెయ్యి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సినవసరం లేదు. 

పరీక్షాకేంద్రాలు ఇవీ.. 
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఉండాలనేది వచ్చే దర ఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తారు. మహిళలకు మూడోవంతు పోస్టులు ఉంటాయి.  

వయో పరిమితి 
మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18–46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్‌ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్‌ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.  

నియామక విధానం 
రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్‌ వెయిటేజ్‌ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్‌లను పరిగణనలోనికి తీసు కుంటారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దర ఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్‌ పొంది ఉండాలి.

టెట్‌ పేపర్‌ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్‌ (రిజర్వేషన్‌ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చేసి ఉండాలి. పేపర్‌–1 టెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్‌ చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement