బాధితులా? నిందితులా? 

TS Ban Online Rummy Game: Addicts Are Looking For Alternatives - Sakshi

2017 నుంచి రాష్ట్రంలో దీనిపై పూర్తి నిషేధం

నకిలీ లొకేషన్‌ యాప్‌లతో ఆడుతున్నట్లు ఆధారాలు

ఐటీ కన్ను పడితే కొత్త ఇబ్బందులు: పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో ఆడి భారీ మొత్తం కోల్పోయినందుకు బాధితులా..? రాష్ట్రంలో నిషేధం ఉన్న ఈ గేమ్‌ను ‘అడ్డదారుల్లో’ ఆడుతున్నందుకు నిందితులా..?  ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌ల విషయంలో పోలీసుల మీమాంస ఇది. వివిధ రకాలైన యాప్‌లను వినియోగించి, జీపీఎస్‌ మార్చి ఆడుతూ... భారీ మొత్తాలు పోగొట్టుకుని తమ వద్దకు వస్తున్న వారి విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. విషయం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ వరకు వెళితే ఆ గేమ్స్‌ ఆడిన వారికి కొత్త ఇబ్బందులు వచ్చిపడతాయని స్పష్టం చేస్తున్నారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌ యాప్స్‌ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ ఆన్‌లైన్‌ రమ్మీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చదవండి: పాణాలు తీసిన జొన్నరొట్టె

మూడేళ్ల క్రితం దీనిపై నిషేధం... 
రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం వరకు పేకాటపై నిషేధం ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్‌లో ఉండే రమ్మీ గేమ్‌లపై ఉండేది కాదు. అయితే ఈ గేమ్‌ ఉచ్చులో యువత చిక్కుకుంటున్నారని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ సైతం ఈ రకమైన చట్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆయా సంస్థ తమ కార్యకలాపాలను నిలిపి వేశాయి. ఇక్కడ ఉండే వాళ్లు ఎవరైనా ఆ సైట్లలోకి ఎంటర్‌ అయినా..సేవలు అందుబాటులో లేవనే సందేశమే కనిపిస్తుంది. ఐపీ అడ్రస్‌తో పాటు లోకేషన్‌కు సంబంధించి అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఆ ప్లేయర్‌ ఎక్కడి వారో గుర్తించే పరిజ్ఞానం వెబ్‌సైట్స్‌ నిర్వాహకుల వద్ద ఉంది. చదవండి: లోన్‌యాప్స్‌ కేసులో ఆసక్తికర విషయాలు

ఇబ్బడిముబ్బడిగా యాప్స్‌ రావడంతో... 
రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం ఉండటంతో దీనికి బానిసలైన వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. గతంలో పొరుగు రాష్ట్రాలతో పాటు గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి ఆడి వచ్చే వారు. ఇటీవల కాలంలో నకిలీ జీపీఎస్‌ యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్స్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్న పేకాట రాయుళ్ళు తాము ఉన్న ప్రాంతం జీపీఎస్‌ లోకేషన్‌ తప్పుగా, వేరే ప్రాంతంలో ఉన్నట్లు చూపించేలా చూస్తున్నారు. ఇలా ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం లేని రాష్ట్రాల లోకేషన్స్‌ను ఈ యాప్‌లలో సెట్‌ చేసి గేమ్‌ ఆడుతున్నారు. లోకేషన్‌ వేరే ప్రాంతంలో చూపిస్తుండటంతో ఆయా వెబ్‌సైట్లు గేమ్‌ ఆడేందుకు అవకాశం ఇస్తున్నాయి.  

కేసుల నమోదుకు అవకాశం లేక... 
ఇలా ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్స్‌ను రెండేళ్ల నుంచి ఆడుతున్న వారు కూడా ఉంటున్నారు. వీరంతా భారీ మొత్తాలు కోల్పోయిన తర్వాత మేల్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో ఆడి తాము భారీ మొత్తాలు కోల్పోయి బాధితులుగా మారామంటూ వచ్చి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి అంశాల్లో ఆయా సంస్థలపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి నకిలీ జీపీఎస్‌ వినియోగించి, రమ్మీపై నిషేధం ఉన్న చోట ఆడినందుకు వీరినే నిందితులుగా పేర్కొనవచ్చని చెప్తున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో అలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ గేమ్స్‌ ఆడుతూ అనేక మంది రూ.లక్షల్లో కోల్పోతున్నారు. వీరి లావాదేవీల విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలిస్తే కొత్త కేసులు వచ్చిపడతాయని స్పçష్టం చేస్తున్నారు. ఈ తరహా పేకాటలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top