కార్పొరేషన్లపై టీఆర్‌ఎస్‌ కన్ను

TRS Party Focused On Corporations - Sakshi

వచ్చే ఏడాది ఆరంభంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు కూడా అదేబాటలో

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున ముగియనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో మూడు మున్సిపల్‌ కర్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలను సాధించేలా టీఆర్‌ఎస్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మున్సిపల్‌ శాఖ మంత్రి హోదాలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ మొదటిదశ పనులను ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మరోవైపు జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతుల పనులకు కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపైనా దృష్టి 
వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల నిమిత్తం ఇప్పటికే పార్టీ నేతలను కేటీఆర్‌ అప్రమత్తం చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం నగర పర్యటనలను కేటీఆర్‌ వాయిదా వేసుకున్నారు. ఆ రెండు కార్పొరేషన్ల పరి ధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలను ఆదేశించారు. అక్టోబర్‌ నాటికి అభివృద్ధికార్యక్రమాలను పూర్తి చేసి, తర్వాత పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి సారించేలా టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో డివిజన్లవారీగా పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఇటీవల జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్‌ సూచించినట్లు సమాచారం.

దుబ్బాక బాధ్యతలు హరీశ్‌కే! 
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యాలయం నోటిఫై చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలు ఎప్పుడనేదానిపై స్పష్టత లేనప్పటికీ, పొరుగునే ఉన్న సిద్దిపేట సెగ్మెంట్‌కు చెందిన మంత్రి హరీశ్‌రావుకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. పార్టీ నేతలు, కేడర్‌ మధ్య సమన్వయంతోపాటు ఉపఎన్నికల కోణంలో పార్టీ యంత్రాంగాన్ని సం సిద్ధం చేసే బాధ్యత హరీశ్‌పై పెట్టినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top