ఒక్క రైలు ఖాళీ ఉండట్లే.. స్పెషల్‌ ట్రైన్‌ల కథేంది?

Train Ticket Demand: Long Waitlist in Indian Railways - Sakshi

అన్ని ప్రధాన రైళ్లలో భారీగా వెయిటింగ్‌ లిస్టు

వివిధ రూట్లలో  పెరిగిన ప్రయాణికుల రద్దీ

పెళ్లిళ్లు, వేడుకలు, పర్యటనలతో పెరిగిన రాకపోకలు

పలు రైళ్లలో 150 నుంచి 200కు పైగా వెయిటింగ్‌ లిస్టు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి వివిధ మార్గాల్లో  ప్రయాణికుల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అన్ని  ప్రధాన రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇందుకనుగుణంగా అదనపు  రైళ్లు అందుబాటులో లేకపోవడంతో వందలాది మంది  ప్రయాణికులు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేకంగా గతేడాది వరకు కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన ప్రయాణాలు ఈ సంవత్సరం  తిరిగి మొదలయ్యాయి. దీంతో  అన్ని రూట్లలో రద్దీ  పెరిగింది.

హైదరాబాద్‌ నుంచి  విశా ఖ, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, పట్నా, కోల్‌ కత్తా, భువనేశ్వర్, తదితర మార్గాల్లో   రాకపోకలు సాగించే రైళ్లలో  వెయిటింగ్‌ లిస్టు  150 నుంచి  200 కు పైగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా పండుగ రోజుల్లో, వేసవి సెలవుల్లో  ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ  ఇటీవల కాలంలో బంధువుల ఇళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరగడంతో  రైళ్లు కిక్కిరిసిపోతున్నట్లు  రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.   

రైళ్ల కొరత... 
ప్రయాణికుల రద్దీ  ఎక్కువగా ఉన్న రూట్లలో డిమాండ్‌ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల  సకాలంలో రిజర్వేషన్‌లు లభించడం లేదు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వైపు వెళ్లే  గోదావరి, గౌతమి, ఈస్ట్‌కోస్ట్, కోకనాడ తదితర రైళ్లలో ఈ నెలాఖరు వరకే కాకుండా వచ్చే నెలలోనూ వెయిటింగ్‌ లిస్టు  దర్శనమిస్తోంది. తిరుపతికి వెళ్లే రైళ్లలోనూ డిమాండ్‌ భారీగా పెరిగింది. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, పర్యాటకుల రద్దీతో  బెంగళూరు, హౌరా, చెన్నై  వైపు వెళ్లే రైళ్లలో  నిరీక్షణ తప్పడం లేదు.

చదవండి: (Hyderabad: హైదరాబాద్‌లో సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌)

సికింద్రాబాద్‌ నుంచి పట్నా వరకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. కానీ  ఈ రూట్‌లో ప్రయాణికుల డిమాండ్‌ మేరకు రైళ్లు  లేవు. దీంతో నెల నుంచి 2 నెలల వరకు ఎదురుచూడాల్సి వస్తుందని  ప్రయాణికులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా  సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు  2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కొంతకాలంగా  ప్రయాణికుల రద్దీ  20 శాతానికి పైగా  పెరిగినట్లు  అధికారులు  అంచనా వేస్తున్నారు. 
 
ప్రత్యేక రైళ్లేవీ... 
రద్దీ  ఉన్న కొన్ని మార్గాల్లో  ఇటీవల కొన్ని ప్రత్యేక రైళ్లను  ఏర్పాటు చేశారు. కానీ వీటిలో  ఎక్కువ శాతం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు కావడంతో  పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని పట్నా వెళ్లేందుకు  రిజర్వేషన్‌ కోసం ఎదురు చూస్తున్న ఓం ప్రకాశ్‌  తెలిపారు. హయత్‌నగర్‌లోని  ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్‌గా పని చేస్తున్న  ఓంప్రకాశ్, అతని సోదరుడు జయప్రకాశ్‌లు సొంత  ఊరికి వెళ్లేందుకు  నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. జంటనగరాల నుంచి  ప్రతి రోజు సుమారు 85  ప్రధాన రైళ్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా మరో 100కు పైగా ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. అయినా ప్రయాణం కోసం పడిగాపులు తప్పడం లేదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top