రేబిస్, బర్డ్ ఫ్లూ, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులపై అప్రమత్తత అవసరం
పాలు, మాంసం, గుడ్లవిషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి
నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: మనుషులు, జంతువుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. మనుషులకు మేలు చేయడంతోపాటు హాని కలిగించడంలో కూడా జంతువుల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలోనే ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నిర్వహిస్తారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం ప్రపంచంలో వెలుగుచూస్తున్న అంటువ్యాధుల్లో దాదాపు 60 శాతం జూనోటిక్ వ్యాధులేనని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువులను నేరుగా తాకడం, మూత్రం, విసర్జనలు, వెంట్రుకలు, లాలాజలం ద్వారా అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది. వాటి నుంచి తయారయ్యే పాలు, మాంసం, గుడ్లు వంటి ఉత్పత్తుల ద్వారా కూడా పలు వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రేబిస్‌పై అప్రమత్తత అత్యవసరం
జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైనది. లక్షణాలు బయటపడిన తర్వాత దాదాపు 100 శాతం ప్రాణాంతకమైన ఈ వ్యాధిని, సకాలంలో వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తిగా నివారించొచ్చు. భారత్‌లో వీధి కుక్కలే రేబిస్ వైరస్‌కు ప్రధాన వాహకాలుగా ఉన్నాయి. బహిరంగంగా చెత్త వేయడం, ఎక్కడపడితే అక్కడ కుక్కలకు ఆహారం వేయడం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది. కుక్కలతోపాటు కోతులు, గబ్బిలాలు, ఎలుకలు కరిచినా వెంటనే వైద్యులను సంప్రదించి యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలి.
ఎవరెవరికి ఇబ్బంది..
రైతులు, పశువుల పెంపకందారులు, పశు వైద్యులు, మాంసం కోసే కార్మికులు, ప్రయోగశాల సిబ్బంది, తోలు, ఉన్ని పరిశ్రమల్లో పనిచేసేవారు జూనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పక్షులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సిట్టాకోసిస్, ఆర్నిథోసిస్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరమంటున్నారు. పందులు కూడా అనేక వైరస్‌లకు నిలయంగా ఉండటంతో వాటి నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి.
పాలు, మాంసం, గుడ్లతోనూ ప్రమాదం
» సరిగ్గా పాశ్చరైజ్ చేయని పాలు, పాల ఉత్పత్తులతో బ్రూసెల్లోసిస్ వ్యాపిస్తుంది.
» కలుషితమైన లేదా సరిగ్గా ఉడికించని మాంసం ద్వారా ఆంథ్రాక్స్, టేప్‌వార్మ్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి.
» వ్యాధి సోకిన కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను పచ్చిగా లేదా సగం ఉడికించి తీసుకున్నా అనారోగ్యమే.
» సూపర్ మార్కెట్లలో నిల్వ ఉంచిన క్యాన్డ్ పానీయాలపై ఎలుకల మూత్రం పడితే వాటి ద్వారా లెప్టోస్పిరోసిస్ వ్యాపిస్తుంది. ఎలుకలు, కుక్కల మూత్రంతో కలుషితమైన నీరు, పరిశుభ్రంగా నిర్వహించని స్విమ్మింగ్ పూల్స్, బయ ట నిల్వ చేసే చెరుకు రసం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
» పిల్లుల నోరు, గోళ్ల వద్ద ఉండే సూక్ష్మజీవుల వల్ల క్యాట్ స్క్రాచ్ ఫీవర్, రేబిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లుల వెంట్రుకల వల్ల కొందరిలో అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నివారణే ఉత్తమ మార్గం
» జూనోటిక్ వ్యాధుల నివారణకు పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. వాటికి ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
» జంతువులను తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
» పాలు, మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించి తీసుకోవాలి.
» క్యాన్డ్ పానీయాలను శుభ్రం చేసిన తర్వాతే తాగాలి.
» జంతువులు కరిచినా లేదా గాయపరిచినా వెంటనే వైద్యసేవలు పొందాలి.


