Schools Reopening In Telangana: తెలంగాణలో మోగిన బడి గంట..

Today Schools Reopened In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బడి గంట మోగింది. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో.. 17 నెలల తర్వాత విద్యార్థులు బడి బాట పట్టారు. నిబంధనలు పాటించని స్కూల్‌ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝళిపిస్తోంది. రాజేంద్రనగర్‌లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 12 పాఠశాల బస్సులను అధికారులు సీజ్‌ చేశారు.

పిల్లల్ని స్కూళ్లకు పంపాలా? లేదా? అనేది తల్లిదండ్రుల ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. ఎలాంటి భయం లేకుంటేనే విద్యార్థుల్ని పాఠశాలలకు పంపాలని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలలు మినహా అన్ని విద్యాసంస్థలను నేటి నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండూ ఉంటాయని స్పష్టం చేసింది. అయితే గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్ల ప్రారంభాన్నీ నిలిపి వేసింది. విద్యా సంస్థల పునఃప్రారంభంపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో.. విద్యాశాఖ మంగళవారం ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

కోవిడ్‌ నిబంధనల అమలు, స్కూళ్లలో శానిటైజేషన్‌ ప్రక్రియపై గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే దూరదర్శన్, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో ప్రైవేటు పాఠశాలలు టీచర్ల ద్వారా ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది.

స్కూల్‌ని సందర్శించిన గవర్నర్‌ తమిళసై
రాజ్‌ భవన్ స్కూల్‌ని గవర్నర్ తమిళిసై బుధవారం ఉదయం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాస్కు ధరించడంపై పిల్లలకు అవగాహన ఉందన్నారు. చిన్న పిల్లలు మాత్రమే మాస్కులు సరిగా పెట్టుకోవడం లేదని అన్నారు. విద్యార్థులతో మాట్లాడటం సంతోషంగా ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. విద్యార్థులను ధైర్యంగా స్కూళ్లకు పంపుతున్న పేరెంట్స్‌కు తమిళిసై అభినందనలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top