
టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
పెంచిన ధరలకే రాష్ట్రంలో టికెట్ల అమ్మకాలు
కోర్టు రిజిస్ట్రీ ఆదేశించినా పట్టించుకోని ఆధికారగణం
సండే కదా.. ఓజీ సినిమాకి పోదామని అరవింద్ ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేద్దామనుకున్నాడు. తీరా చూసి నోరెళ్లబెట్టాడు. అంతకు రెండ్రోజుల క్రితమే ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపును హైకోర్టు కొట్టేసిందని విన్న అతనికి ఆ ధరలు చూస్తే ఏమీ అర్థం కాలేదు. నిజంగానే హైకోర్టు తగ్గింపు ఉత్తర్వులిచ్చిందా? లేక థియేటర్లు అమలు చేయడం లేదా? అనే డైలమాలో పడ్డాడు.
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ టికెట్ల ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు శుక్రవారం కొట్టివేసినా, పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారు. శనివారం టికెట్ల బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో ప్రయతి్నస్తే పెంచిన ధరలే కనిపించాయని పలువురు వాపోయారు. హైదరాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోని థియేటర్లలో ఈ వ్యత్యాసం కనిపించిందని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీ వరకు ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుతూ, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిష¯న్ దాఖలు చేశారు.
ఈ పిటిష¯న్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. టికెట్ ధరల పెంపు మెమోను నిలిపివేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ హైకోర్టులో అప్పీల్ చేయగా, విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. 26న విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని కోరింది. ‘ఓజీ’చిత్రానికి ఎలాంటి ఉపశమన ఆదేశాలు జారీ చేయలేమని శుక్రవారం విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. ఈ నెల 24 ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ.. అక్టోబర్ 9కి విచారణ వాయిదా వేశారు. అయినా పెంచిన ధరలనే థియేటర్లు వసూలు చేస్తున్నాయి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం..
ఓజీ చిత్ర టికెట్ ధరల పెంపు మెమోను ప్రభుత్వం నిలిపివేసినా సోషల్ మీడియాలో తీర్పునకు వక్రభాష్యం చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా టికెట్ ధరలను తగ్గించడం లేదు. తప్పుడు సందేశాలు, పెంచిన టికెట్ ధరలు వసూలు చేయడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. – బర్ల మల్లేశ్, న్యాయవాది