నంబర్‌ ఒకటే.. బండ్లు మూడు | Three arrested for using one registration number on three scooters in Hyderabad | Sakshi
Sakshi News home page

నంబర్‌ ఒకటే.. బండ్లు మూడు

Jul 6 2026 9:31 AM | Updated on Jul 6 2026 10:07 AM

Three arrested for using one registration number on three scooters in Hyderabad

హైదరాబాద్: ట్రాఫిక్‌ చలానాలు, ఫైనాన్స్‌ కంపెనీల జప్తుల నుంచి తప్పించుకోవడానికి ఒకే నంబర్‌ ప్లేట్‌ను మూడు వేర్వేరు ద్విచక్ర వాహనాలకు వాడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను చారి్మనార్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్సిగుట్ట కమలా నెహ్రూ నగర్‌కు చెందిన నాకోటి మల్లికార్జున్, భీమ్‌ అజయ్‌ రెడ్డి, సంజీవపురానికి చెందిన కొప్పుల ధనరాజ్‌ స్నేహితులు. 

మల్లికార్జున్‌కు సాయి రామ్‌ అనే వ్యక్తి రుణ బకాయి కింద ఫైనాన్స్‌ చేసిన, ఇంకా రిజిస్ట్రేషన్‌ కాని హోండా యాక్టివా వాహనాన్ని ఇచ్చాడు. ఈ వాహనంపై ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు రూ. 36,000 బకాయి ఉండటంతో సీజ్‌ చేస్తారని మల్లికార్జున్‌ పథకం రచించాడు. తన అసలైన యాక్టివా వాహనం నంబర్‌ (టీఎస్‌ 09 ఎఫ్‌ఈ 4997)తో నకిలీ నంబర్‌ ప్లేట్‌ను తయారు చేయించి ఫైనాన్స్‌ ఉన్న వాహనానికి తగిలించి అజయ్‌ రెడ్డికి ఇచ్చాడు. 

ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ చలానాల నుంచి తప్పించుకోవడానికి స్నేహితుడు కొప్పుల ధనరాజ్‌కు ఈ నంబర్‌ ప్లేట్‌నే వాడాల్సిందిగా మల్లికార్జున్‌ సూచించాడు. ఒకే నంబర్‌ ప్లేట్‌ను మూడు వాహనాలకు ఉపయోగిస్తూ వీరు రోడ్లపై తిరుగుతున్నారు. చార్మినార్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు వారాసిగూడలో తనిఖీలు చేయగా అజయ్‌ రెడ్డి పట్టుబడ్డాడు. అతనితో పాటు ఉన్న మిగిలిన ఇద్దరినీ విచారించి, అధికారిక డేటాబేస్‌ ద్వారా వాహన ఇంజిన్, చాసిస్‌ నంబర్లను పరిశీలించగా ఈ ఘరానా మోసం బయటపడటంతో నిందితులపై కేసు నమోదు చేశారు.      

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement