
మరిన్ని కొత్త పథకాలు అమలుచేస్తాం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
బంజారాహిల్స్: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. ఎవరికీ సంక్షేమ పథకాలను రద్దుచేయబోమని భరోసా ఇచ్చారు. అర్హులకు మరిన్ని పథకాలు అమలవుతాయని చెప్పారు.
బంజారాహిల్స్ ఎన్‌బీటీనగర్‌లోని ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ తో కలిసి గురువారం ఆయన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుటుంబ సర్వేపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.
సర్వే సమాచారం గోప్యంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల స్థితిగతులు తెలుసుకొని పటిష్టమైన భవిష్యత్తు ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో మంచి మార్పు తీసుకువచ్చి ఆదర్శ తెలంగాణను ఆవిష్కరించటమే సర్వే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 30 శాతం సర్వే పూర్తయ్యిందని తెలిపారు.