రీజియన్ స్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఆనవాయితీ విధానాన్ని పాటించకపోవడమే కారణం
మొత్తం ఓట్లలో 50 శాతంకంటే ఎక్కువ ఓట్లు పొందాలన్న విధానానికి స్వస్తి
సాధారణ మెజారిటీ ఆధారంగా విజేత ప్రకటన
ఇది అధికార పార్టీ అనుకూల కూటమి కోసమే చేశారంటూ మిగతా యూనియన్ల ఆరోపణలు
న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఈయూ కూటమి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, ఎన్నిక ఫలితాల మీద వివాదం చెలరేగింది. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు మొదలైనప్పటి నుంచి అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా ఈసారి రీజియన్ స్థాయి గుర్తింపును కట్టబెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. దీనిపై ఇతర యూనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కించుకున్న ఈయూ కూటమి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈనెల 9న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా అదే రోజు కౌంటింగ్ పూర్తి చేయడంతో విజేతలెవరో తేలిపోయింది.
14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు వీలు కల్పించడంతో అధికారికంగా ఫలితాలను ఈనెల 17 రాత్రి వెల్లడించారు. ఇందులో రాష్ట్రస్థాయి గుర్తింపులో టీఎంయూ, ఎన్ఎంయూలతో కూడిన ఈయూ కూటమి 4,670 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, రీజియన్ స్థాయి గుర్తింపు విషయంలోనే వివాదం మొదలైంది. సాధారణంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేస్తారు. ఒకటి రాష్ట్రస్థాయి గుర్తింపునకు, రెండోది రీజియన్ స్థాయి గుర్తింపునకు వేస్తారు. రాష్ట్రస్థాయి గుర్తింపులో ఏ యూనియన్‌కు ఆధిక్యత వస్తే ఆ యూనియన్ విజయం సాధించినట్లవుతుంది. కానీ, రీజియన్ స్థాయిలో మాత్రం మెజారిటీ ఓట్లు కాకుండా మొత్తం ఓట్లలో 50 శాతం కంటే కనీసం ఒక ఓటు వచ్చిన యూనియన్ను విజేతగా ప్రకటిస్తారు.
ఇది ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు మొదలైనప్పుడు జరిగిన ఒప్పందం. అప్పటి నుంచి దీన్ని అనుసరిస్తున్నారు. 50 శాతం కంటే కనీసం ఒక ఓటు ఏ యూనియన్‌కు రాకుంటే ఏ యూనియన్నూ కూడా విజేతగా ప్రకటించరు. అప్పుడు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు యూనియన్‌గా ఎన్నికైన యూనియన్ను ఆ రీజియన్ గుర్తింపు యూనియన్‌గా ప్రకటించడం ఆ పద్ధతిలో భాగం, తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏడు రీజియన్లలో 50 శాతం కంటే ఒక ఓటు చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ రీజియన్లలో టీఎంయూ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి రీజియన్లలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఖమ్మంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్లు విజయం సాధించాయి. మిగతా రీజియన్లలో ఆ పద్ధతిలో ఓట్లు పోల్ కాలేదు.
ఆనవాయితీకి భిన్నంగా..
కానీ, తాజాగా ప్రకటించిన ఫలితాల్లో, మిగతా రీజియన్లలో ఆనవాయితీకి భిన్నంగా సాధారణ మెజారిటీ పొందిన యూనియన్లను విజేతగా ప్రకటించారు. దీంతో మెదక్, వరంగల్ రీజియన్లలో ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, నల్గొండలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, హైదరాబాద్ రీజియన్‌లో టీఎంయూలు విజేతలుగా నిలిచాయి. ఇందులో ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్లు కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన టీడబ్ల్యూయూ కూటమిలో ఉన్నాయి. ఫలితంగా, రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కించుకోలేకపోయిన ఆ కూటమి, రీజియన్లలో మెజారిటీ రీజియన్లు సాధించినట్లయింది.
అధికార పార్టీ జోక్యం వల్లనే ఇలా జరిగిందని వైరి కూటమిలోని యూనియన్లు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం ఫలితాలు లెక్కించి ఉంటే, ఏ యూనియన్‌కు కూడా మెజారిటీ దక్కని నాలుగు రీజియన్లు రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కించుకున్న ఈయూ ఖాతాలోకి చేరేవి. అలా కాకుండా ఇప్పుడు అధికార పార్టీ కూటమికి దక్కేలా పావులు కదిపారన్నది వాటి ఆరోపణ. అయితే, ఆనవాయితీగా వస్తున్న విధానానికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధ నిబంధన కాదని, సింగరేణి, రైల్వే యూనియన్ ఎన్నికల్లో ఇలాంటి పద్ధతి లేదని, మిగతా సంస్థల్లో మెజారిటీ ఓట్లే ప్రాతిపదిక అని, ఇప్పుడు ఆరీ్టసీలో కూడా దాన్నే అనుసరించారని, దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అధికార పార్టీ బలపరిచిన కూటమిలోని యూనియన్లు పేర్కొంటున్నాయి.
డిపోల్లో గెలిచాం...
9 రీజియన్లలో గుర్తింపు మాదే: మొగుళ్ల రాజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌తో కలిసి తాము మొత్తం 51 డిపోల్లో విజయం సాధించామని అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) వెల్లడించింది. రాష్ట్రంలోని 97 డిపోలకు గాను 51 డిపోల్లో గెలవడంతో పాటు 14 రీజియన్లలో తొమ్మిదింట గుర్తింపు తమకే వచ్చిందని, నాన్ ఆపరేషన్ పరిధిలోనికి వచ్చే బస్‌భవన్‌తో సహా ఆర్ఎం కార్యాలయాలు, వర్క్‌షాప్‌లు కలిపి ఎనిమిది యూనిట్లలోనూ తామే గెలిచామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విజయం కార్మికుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, తమ యూనియన్ పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనమని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కార్మీకుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ కూటమికి మద్దతు తెలిపిన కార్మీకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఎన్నికల్లో తమపై కార్మికులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ఆ ప్రకటనలో రాజిరెడ్డి స్పష్టం చేశారు.


