హైడ్రా ఎఫెక్ట్‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు | Telangana Revenue Officers Give Notices To Marri Rajashekar Reddy Colleges, Know Reason Inside | Sakshi
Sakshi News home page

హైడ్రా ఎఫెక్ట్‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు

Aug 28 2024 10:49 AM | Updated on Aug 28 2024 11:56 AM

TG Revenue Officers Give Notices To Marri Rajashekar Reddy Colleges

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

వివరాల ప్రకారం.. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్‌ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ సహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. 

ఇక, మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు ఆక్రమించారని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని.. లేకపోతే మేమే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో వెల్లడించారు. 489, 485, 458, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్స్, షెడ్స్, వెహికిల్ పార్కింగ్‌తో పాటు కాలేజీ రోడ్లు వేశారని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో, మరోసారి హైడ్రా కూల్చివేతల అంశంలో హాట్‌ టాపిక్‌ మారింది.

మరోవైపు.. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని 13 చెరువుల్లో కబ్జాల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కలెక్టర్.. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు. 

ఇదిలా ఉండగా.. నగరంలో ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. నటుడు నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘ఒవైసీ, మల్లారెడ్డి అనేది చూడం. విద్యార్థుల భవిష్యత్‌ గురించి ఆలోచిస్తాం. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చు. ఎఫ్‌టీఎల్‌ అనేది ముఖ్యమైన అంశమే, దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తాం. పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి. ధర్మసత్రమైనా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ నగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటున్నారు. పలు అక్రమ నిర్మాణాలపై దృష్టిసారిస్తున్నారు. ఇక, హైడ్రా ఆఫీసుకు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు కూడా సెక్యూరిటీని పెంచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement