- ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించండి
- భవిష్యత్తు అవసరాలు, సవాళ్లను ఎదుర్కొనేలా ‘ఎకో సిస్టం’ అభివృద్ధి
- మలేషియా అత్యున్నత స్థాయి బృందం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని... ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రపంచస్థాయి సదుపాయాలతో కూడిన సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామన్నారు.
మలేషియా – పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘తెలంగాణ- మలేషియా(పెనాంగ్)’ మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్ మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు.
తెలంగాణ ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పెనాంగ్‌కు ఉన్న అనుభవం... గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం" అని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు.


