తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేత | TG HC hearing over BC reservations in local bodies Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేత

Oct 9 2025 3:46 PM | Updated on Oct 9 2025 5:08 PM

TG HC hearing over BC reservations in local bodies Updates

సాక్షి,హైదరాబాద్‌: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది. 

దీనిపై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది.  హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గురువారం(అక్టోబర్‌ 9వ తేదీ) హైకోర్టులో విచారణలో భాగంగా  ఏజీ  సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘ 57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్‌ ఎందుకు?, బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు. 

గవర్నర్‌ గడువులోగా  ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్‌ రెడ్డి. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు.  కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్‌ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది. మేం రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం’ అని వివరించారు. 

ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని  రాజ్యాంంగంలో ఎక్కడా లేదన్నారు.  ‘ తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15 శాతం మాత్రమే. ఆ 15 శాతం మందికి 33 శాతం సీట్లు ఇస్తున్నాం’ అని హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.

ఇది కూడా చదవండి:

తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement