సిండికేట్‌కే 'కోడిగుడ్లు'! | Tenders for distributing eggs to children go to old contractors | Sakshi
Sakshi News home page

సిండికేట్‌కే 'కోడిగుడ్లు'!

Aug 15 2025 12:44 AM | Updated on Aug 15 2025 12:44 AM

Tenders for distributing eggs to children go to old contractors

జిల్లాస్థాయిలో టెండర్లు దక్కించుకున్న వారిలో పాత కాంట్రాక్టర్లే ఎక్కువ 

గత కాంట్రాక్టర్లకే అనుకూలంగా నిబంధనలు...మార్కెట్‌ రేటు కంటే అత్యధికంగా టెండర్ల కోట్‌  

31 జిల్లాల కాంట్రాక్టును దక్కించుకున్నది పది మంది కాంట్రాక్టర్లు.. ఒక్కో కాంట్రాక్టర్‌కు గరిష్టంగా 8 జిల్లాలు 

మరో రెండు జిల్లాల్లో రెండు రోజుల్లో పూర్తి కానున్న టెండర్ల ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లోని పిల్లలకు కోడిగుడ్లు పంపిణీ చేసే టెండర్లు మెజారిటీగా పాత కాంట్రాక్టర్లకే దక్కాయి. 33 జిల్లాల్లో కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ గత నెలలో జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ)ల ద్వారా ప్రారంభం కాగా, ఇప్పటికే 31 జిల్లాల్లో టెండర్లు తెరిచారు. 

టెండర్లు దక్కించుకున్న వారిలో రెండేళ్లుగా పంపిణీ చేసిన ఏడుగురు కాంట్రాక్టర్లు(పాతవారే) ఉండగా, కొత్తగా మరో ముగ్గురు పౌల్ట్రీ రైతులు ఉన్నారు. మరో రెండు జిల్లాల్లో టెండర్లు తెరిచి కాంట్రాక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈ రెండు జిల్లాలు సైతం పాత కాంట్రాక్టర్లకే దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

జోనల్‌ నుంచి జిల్లా వరకు... 
అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ ఏడాది మార్చి 30న జోనల్‌ స్థాయి టెండర్లు పిలిచింది. పంపిణీలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ టెండరు నిబంధనలు కొత్తగా రూపొందించింది. 

ఈ నిబంధనలు కేవలం బడా రైతులు, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉన్నాయంటూ పౌల్ట్రీ రైతులు సీఎం దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీంతో పలుమార్లు టెండరు గడువును పొడిగించిన అధికారులు, దాదాపు మూడున్నర నెలల తర్వాత టెండరును రద్దు చేశారు. 

ఆ తర్వాత జోనల్‌ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో కాంట్రాక్ట ఎంపిక చేయాలని నిర్దేశించిన ప్రభుత్వం..ఆ మేరకు అంగన్‌వాడీలతో పాటు గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, మోడల్‌సూ్కల్స్‌ తదితర ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఒకే కాంట్రాక్టర్‌ను జిల్లా స్థాయిలో ఎంపిక చేయాలని సీఎస్‌ రామకృష్ణారావు జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాస్థాయిలో టెండర్లను డీపీసీలు పిలిచాయి.

కఠిన నిబంధనలతో చెక్‌  
కేవలం పౌల్ట్రీ ఫామ్‌కు యజమానిగా ఉన్న రైతు మాత్రమే టెండర్‌లో పాల్గొనాలని, అద్దె ప్రాతిపదిక రైతుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. మూడు సంవత్సరాలుగా నిర్దేశించిన లొకేషన్లో ఫామ్‌ నిర్వహించాలని స్పష్టం చేస్తూ ఒక రైతు గరిష్టంగా ఎనిమిది జిల్లాల్లో టెండరుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తుదారుడు ఏటా రూ.5 కోట్ల విలువైన కోడిగుడ్లు వరుసగా మూడేళ్లు సరఫరా చేసి ఉండాలి. 

2022–23, 2023–24, 2024–25 సంవత్సరాల్లో కనీసం రూ.4 కోట్ల టర్నోవర్‌ ఉన్న పౌల్ట్రీ రైతు మాత్రమే టెండర్‌లో పాల్గొనేందుకు అర్హత ఉంటుంది. దరఖాస్తుదారుడికి అగ్‌మార్క్‌ సర్టిఫికెట్‌తో పాటు రిప్లికా సీరియల్‌ నంబర్‌తో కూడిన గ్రేడింగ్‌ సర్టిఫికెట్‌ టెండర్‌ తేదీ కంటే ముందుగా ఉండాలి.  టెండర్‌లో కోట్‌ చేసిన కోటాలో కనీసం 40 శాతం కాంట్రాక్టర్‌ సొంత ఫామ్‌లో ఉత్పత్తి కావాలి. 

మిగిలిన మొత్తాన్ని సమీపంలోని రైతుల నుంచి తీసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు సంబంధించిన పశుసంవర్ధక శాఖ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పౌల్ట్రీ రైతులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కేవలం ఇప్పటివరకు కొనసాగిన కాంట్రాక్టర్లకే ఉన్నాయనేది రైతుల వాదన. 

తాజాగా జిల్లా స్థాయి టెండర్ల విధానం ద్వారా ఎంపికైన వారిలో  గతంలో కాంట్రాక్టులు దక్కించుకున్న ఎనిమిది మందిలో ఈసారి ఏడుగురికి మళ్లీ అవకాశం దక్కింది. కొత్తగా ముగ్గురు రైతులకు కాంట్రాక్టులు దక్కాయి. ఒక్కో కాంట్రాక్టర్‌కు గరిష్టంగా 2 నుంచి 8 జిల్లాల కాంట్రాక్టు దక్కింది. 

గుడ్ల సరఫరా కాంట్రాక్టర్లు నిర్దేశించిన కోటాను గడువు ప్రకారం స్టాక్‌ పాయింట్‌ వద్ద డెలివరీ చేయాలి. అయితే పాత కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ ఫిర్యాదులు వెళ్లాయి.  

మార్కెట్‌ ధర కంటే అధికంగా... 
నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) తాజా వివరాల ప్రకారం.. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కోడిగుడ్డ ధర ఒక్కంటికి రూ.5.23గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.485కు వంద గుడ్లు లభిస్తుండగా, వరంగల్‌లో రూ.487గా ఉంది. ధరల వత్యాసం సగటున 2 శాతం అటుఇటుగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. 

అయితే తాజాగా కోట్‌ చేసిన గుడ్ల ధరలు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంట్రాక్టర్లు ఒక్కో గుడ్డుకు రూ.6.10 నుంచి రూ.6.40 మధ్యలో కోట్‌ చేశారు. హైదరాబాద్‌లో రూ.6.10 చొప్పున కోట్‌ చేయగా, మహబూబ్‌నగర్‌లో రూ.6.40 చొప్పున కోట్‌ చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో రూ.6.39 చొప్పున, ఆదిలాబాద్‌లో రూ.6.36, జనగామ జిల్లాలో 6.28, జగిత్యాల జిల్లాలో రూ.6.14 చొప్పున కోట్‌ చేసిన వారికి కాంట్రాక్టు దక్కింది. 

హోల్‌సేల్‌ ధరల పోలిస్తే..తక్కువకు సరఫరా చేయాల్సి ఉండగా... ఇక్కడ అందుకు భిన్నంగా బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కోట్‌ చేసినా కాంట్రాక్టు దక్కడం విశేషం. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుదారుల పోటీ లేకపోవడంతో కోట్‌ చేసిన ధరకే టెండర్‌ దక్కినట్టు తెలుస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement