జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు

Telugu Students Shine in JEE Mains 2024 - Sakshi

టాప్‌–23లో పది మంది తెలుగు వాళ్లే... వీరిలో ఏడుగురు తెలంగాణ విద్యార్థులు 

మెయిన్స్‌ తొలి విడత ఫలితాలు వెల్లడించిన ఎన్‌టీఏ 

సాక్షి, హైదరాబాద్‌/జహీరాబాద్‌ టౌన్‌: జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్‌–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్‌ శుక్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌ సహా పదిమంది వంద శాతం స్కోర్‌ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు.

మొత్తమ్మీద టాప్‌–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్‌ భట్‌ దేశంలో టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్‌కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్‌ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 

300కు 300 మార్కులు 
జేఈఈ మెయిన్స్‌ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్‌ శుక్లా, రోహన్‌ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్‌ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్‌ మోహన్‌ కల్లూరి, తవ్వా దినేష్‌ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి షేక్‌ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్‌ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్‌ 99.98 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు.  

కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్‌  
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని మల్‌చెల్మ గ్రామానికి చెందిన హందేకర్‌ అనిల్‌కుమార్‌ కుమారుడు హందేకర్‌ విదిత్‌ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్‌ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు.  

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top